ఆయన వృత్తి ఎలక్ట్రీషియన్.. ప్రవృత్తి మేజిషియన్.. కానీ వృత్తి, ప్రవృత్తి కంటే ఎక్కువ ఇష్టంగా పాములు పడతాడు. ఏదో హాబీగా చేయటం కాదండోయ్.. ఇక్కడ పాముందని ఒక్క ఫోన్ చేస్తే చాలు క్షణాల్లో వాలిపోయి.. పామును పట్టుకుని దానితో మాట్లాడి.. సురక్షిత ప్రాంతాల్లో వదిలేస్తుంటాడు. ఇలా ఒకటి కాదు రెండు కాదు వందలు వేలు కాదు ఏకంగా 10 వేల పాములు పట్టి రికార్డు క్రియేట్ చేశాడు ఈ స్నేక్ మ్యాన్. కేవలం పాములు పట్టి వాటిని వేరే ప్రాంతాల్లో వదిలేయటమే కాదు.. ప్రజల్లోనూ పాముల గురించి అవగాహన కల్పిస్తూ.. వాటి పట్ల ఉన్న భయాన్ని తొలిగించే ప్రయత్నం చేస్తుంటాడు. మరి ఈ స్నేక్ మ్యాన్ గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మీకోసం..
హనుమకొండ జిల్లా సుబ్బయ్యపల్లికి చెందిన జయకర్.. ప్రధాన వృత్తి ఎలక్ట్రీషియన్. అప్పుడప్పుడు మేజిషియన్‌గా కూడా ప్రదర్శనలు ఇస్తుంటారు. కాగా.. కేవలం మ్యాజిక్ చేయటమే కాకుండా.. ఏ పామునైనా ఇట్టే పట్టేయడంలో జయకర్ నిష్ణాతుడు. అయితే.. ఓసారి ఇంట్లో దూరిన పామును కొందరు కొట్టి చంపేయడం చూసి తీవ్ర ఆవేదనకు గురైన జయకర్.. తనకు తానుగా పాములను పట్టడం నేర్చుకున్నాడు. పాములు పట్టటంలో పూర్తిగా ఆరితేరిన జయకర్.. అప్పటి నుంచి.. ఎక్కడ పాము ఉందని ఫోన్ వస్తే అక్కడికి వెళ్లి అవలీలగా పాములు పట్టటం మొదలుపెట్టాడు.
జనవాసాల్లోకి ఎక్కడ పాము వచ్చిందని ఫోన్ వచ్చినా.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వాలిపోయి సర్పాన్ని ప్రేమగా పట్టుకుంటాడు జయకర్. ఇలా ఒకటి కాదు రెండు కాదు.. ఇప్పటి వరకు 10 వేల పాములను పట్టుకున్నాడు. సామాన్యుల ఇళ్లలోనే కాదు వీఐపీల ఇళ్లల్లోనూ వందల సంఖ్యలో పాములు పట్టాడు ఈ స్నేక్ మ్యాన్.
పాములు పట్టే క్రమంలో కొన్నిసార్లు అవి కాటేసినా.. ఎక్కడా భయపడటం కానీ.. పాములు పట్టటం ఆపేయటం కానీ జయకర్ చేయలేదు. పైగా.. పాములు ప్రమాదకరం కాదని, మానవాళికి ఎంతో ఉపయోగం చేస్తాయంటూ.. అవగాహన కార్యక్రమాలు చేపట్డారు. పాములను చంపకూడదని వివరిస్తుంటాడు. పాములు పగబడతాయని, పాలు తాగుతాయంటూ నమ్మకం మూర్ఖత్వమేనని.. జనాల్లో ఉన్న మూఢ నమ్మకాలను తీసేసేందుకు కృషి చేస్తున్నారు. అందుకుగానూ.. పురస్కారాలు కూడా అందుకున్నారు ఈ జయకర్ అలియాస్ స్నేక్ మ్యాన్.