సినీ నటుడు అల్లు అర్జున్ ఇంటిపై జరిగిన దాడిని సినిమాటోగ్రఫి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో భౌతికదాడులకు తావులేదని చెప్పారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరూ వ్యవహరించకూడదన్నారు. సంధ్య థియేటర్ ఘటనకు సంబంధించిన అంశం కోర్టులో ఉందని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఎక్స్ వేదికగా అన్నారు.స్టార్ హీరో అల్లు అర్జున్ ఇంటిపై దాడి కేసులో నిందితులకు కోర్టు బెయిల్ విధించింది. శాసనసభలో సీఎం రేవంత్‌రెడ్డి అల్లు అర్జున్‌పై విమర్శలు చేయడం, తన వ్యక్తిత్వంపై దుష్ప్రచారం జరుగుతున్నదని అల్లు అర్జున్ ఆవేదన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆదివారం మరోసారి ఉద్రిక్తత పరిస్థితి తలెత్తిన విషయం తెలిసిందే. జూబ్లీహిల్స్‌లోని అల్లు అర్జున్ ఇంటిపై 10 మంది యువకులు దాడి చేశారు. గేట్లను తోసుకుంటూ ఇంట్లోకి వెళ్లేందుకు యత్నించారు. అడ్డుకున్న సిబ్బందిని చితకబాదారు. ఆవరణలోని పూలకుండీలను ధ్వంసం చేశారు. అల్లు అర్జున్ ఖబర్దార్ అంటూ నినాదాలు చేశారు.
అల్లు అర్జున్ సిబ్బంది ఇచ్చిన సమాచారంతో పోలీసులు అక్కడికి వచ్చి యువకులను అరెస్ట్ చేశారు. అల్లు అరవింద్ మేనేజర్ కాంతారావు ఫిర్యాదు మేరకు కేసు బీఎన్ఎస్ 331(5), 190, 191(2), 324(2), 292, 126(2), 131 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. ఓయూ జేఏసీ నేతలుగా చెప్పుకున్న వారిని చౌటుప్పల్‌కు చెందిన నాగరాజ్, యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన నగేశ్, కొడంగల్ నియోజకవర్గానికి చెందిన రెడ్డి శ్రీనివాస్, మోహన్, చర్లపల్లికి చెందిన ప్రేమ్‌కుమార్, షాద్‌నగర్‌కు చెందిన ప్రకాశ్‌గా గుర్తించారు.