సినీ ప్రముఖులతో కొనసాగుతున్న సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైన ప్రకటన చేశారు. సినిమాల బెనిఫిట్ షోలకు, టికెట్ల రేట్ల పెంపుకు ఇకపై అనుమతించబోమని ఆయన స్పష్టం చేశారు. ఈ అంశంపై అసెంబ్లీలో తాను, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన ప్రకటనలకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. ముందస్తు అనుమతులు, తగిన బందోబస్తు ఉంటేనే సినిమా ఈవెంట్లకు అనుమతి ఇస్తామని చెప్పారు. శాంతిభద్రతల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని అన్నారు. బౌన్సర్ల విషయంలో కూడా ఇకపై కఠినంగా ఉంటానని చెప్పారు.సినీ పరిశ్రమకు తాము వ్యతిరేకం కాదని రేవంత్ స్పష్టం చేశారు. ఉద్దేశ పూర్వకంగా కేసులు పెట్టలేదని చెప్పారు. సినీ ఇండస్ట్రీ అభివృద్ధికి తమ ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని తెలిపారు. తెలంగాణలో షూటింగ్స్ కు మరిన్ని రాయితీలు ఇవ్వాలన్న విన్నపంపై కమిటీ వేస్తామని చెప్పారు. టెంపుల్ టూరిజం, ఎకో టూరిజాన్ని టాలీవుడ్ ప్రమోట్ చేయాలని సూచించారు. సినిమా రిలీజ్, ఈవెంట్స్ సమయంలో అభిమానుల్ని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత సెలబ్రిటీలదేని చెప్పారు. తెలంగాణ రైజింగ్ లో ఇండస్ట్రీ సోషల్ రెస్పాన్సిబిలిటీతో ఉండాలని అన్నారు. ఇన్వెస్ట్ మెంట్ల విషయంలో కూడా ఇండస్ట్రీ సహకరించాలని అన్నారు. ఈ సందర్భంగా రాఘవేంద్రరావు మాట్లాడుతూ... అందరు సీఎంలు ఇండస్ట్రీని బాగా చూసుకున్నారని చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా ఇండస్ట్రీని బాగా చూసుకుంటుందని తెలిపారు. ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా దిల్ రాజును నియమించడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వంపై తమకు పూర్తి నమ్మకం ఉందని మురళీమోహన్ తెలిపారు. సంధ్య థియేటర్ ఘటన తమను బాధించిందని చెప్పారు. తెలుగు సినీ పరిశ్రమకు ఈరోజు శుభదినమని అల్లు అరవింద్ వ్యాఖ్యానించారు.