నల్గొండ జిల్లాలో కల్తీ కల్లు కలకలం సృష్టించింది. కల్తీ కల్లు తాగిన ఆరుగురు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం పెర్కకొండారంకు చెందిన దుబ్బాక అచ్చయ్య, పాక పిచ్చయ్య, వల్లపు లింగయ్య, మేడిపల్లి భిక్షం, గంట రామచంద్రయ్య, కన్నీబోయిన నరేష్ వ్యవసాయ కూలీలు పనిచేస్తున్నారు.రోజు మాదిరిగానే గ్రామానికి చెందిన గీత కార్మికుడి వద్ద గ్రామ శివారులో ఉన్న కుమ్మరి కుంట వద్ద మధ్యాహ్నం కల్లు తాగారు. అయితే అనుహ్యంగా వారంతా అస్వస్థతకు గురయ్యారు.కల్లు తాగిన వారంతా సాయంత్రం ఐదు గంటల సమయంలో ఇంటికి చేరుకున్నారు. అయితే వీరందరికీ వాంతులు, విరేచనాలు, వనకడం ప్రారంభమయ్యాయి. గమనించిన కుటుంబ సభ్యులు బాధితులను నకిరేకల్ ఆసుపత్రికి తరలించారు. బాధితులకు వైద్యులు పరీక్షలు నిర్వహించి కల్తీ కల్లు తాగడం వల్లే వాంతులు, విరేచనాలు అవుతున్నాయని వైద్యులు తెలిపారు. వీరిలో దుబ్బాక అచ్చయ్య, పాక పిచ్చయ్య పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌కు తరలించారు. కల్తీ కల్లు ఘటనపై ఎక్సైజ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కల్లు కల్తీ కావడానికి గల కారణాలపై ఆదా తీస్తున్నారు.