వచ్చే వేసవిని సమర్థంగా ఎదుర్కొనేందుకు 'అడ్వాన్స్ సమ్మర్ స్పెషల్ యాక్షన్ ప్లాన్- 2025' కు జలమండలి సిద్ధమైంది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని సూక్ష్మస్థాయిలో తాగునీటి సమస్యపై పర్యవేక్షణ కోసం ఫిబ్రవరి 15 నుంచి జూన్ 15 వరకు '120 డేస్ మైక్రో వాటర్ మానిటరింగ్ డ్రెవ్' నిర్వహించాలని నిర్ణయించింది. అంతకు ముందు క్షేత్రస్థాయి పరిస్థితిపై సమగ్ర పరిశీలన కోసం ఈ నెల 5 నుంచి 20 రోజుల పాటు 'ప్రీ సమ్మర్ వాటర్ సర్వే'కు శ్రీకారం చుట్టనుంది. నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో నీటి ఎద్దడి ఏ మేరకు ఉంటుంది? ఏయే ప్రాంతాల్లో సమస్య ఎదురయ్యే అవకాశం ఉందని ముందస్తుగానే గుర్తించనుంది. సెక్షన్ మేనేజర్ పరిధిలో పరిస్థితులపై సమగ్రంగా పరిశీలించి వేసవిలో నీటి ఎద్దడిపై అంచనాపై నివేదికలు రూపొందించేలా చర్యలు చేపట్టనుంది. ఇందుకోసం ఈ నెల మొదటి వారంలో ఖైరతాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో ఒకరోజు వర్క్‌షాప్ నిర్వహించి ప్రీ సమ్మర్ వాటర్ సర్వేపై దశాదిశ నిర్దేశించనుంది.
గత పదేళ్లలో దేశం నలు మూలల నుంచి వలసలు పెరగడంతో హైదరాబాద్ నగరంలో 30 శాతం జనాభా పెరిగింది. మరోవైపు జలమండలి పరిధి విస్తరించింది. నల్లా కనెక్షన్లు అదే స్థాయిలో పెరిగాయి. ప్రధాన జలాశయాల్లో తాగునీటి కేటాయింపు మాత్రం పెరగలేదు. ప్రస్తుతం పదేళ్ల నాటి కేటాయింపుల నీటి సరఫరా జరుగుతోంది. వేసవిలో అవసరమైతే ఎప్పటి మాదిరిగానే అదనంగా పది ఎంజీడీలు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి.అవసరాలు పెరిగినా.. కేటాయింపులు పెరగక పోవడంతో ఉన్న నీటిని సర్దుబాటు చేసుకునేందుకు జలమండలి వృథా నీటిపై దృష్టి సారించింది. ఈ ఏడాది అధిక వర్షపాతం నమోదైనా.. భూగర్భ జలాలు పలు ప్రాంతాల్లో ఆశాజనకంగా పెరగలేదు. ఈ నేపథ్యంలో నీటికి భారీగా డిమాండ్ ఎదురయ్యే అవకాశం ఉంటుందని జలమండలి అంచనా వేసింది. గత వేసవిలో ప్రధాన జలాశయాల్లో నీటి మట్టాలు డెడ్‌స్టోరేజీకి చేరడంతో అత్యవసర పంపింగ్ తప్పలేదు. ఈసారి అలాంటి సమస్య పునరావృతం కాకుండా చర్యలకు ఉపక్రమించింది.
వేసవిలో డిమాండ్‌కు తగ్గ ట్యాంకర్లలను సకాలంలో సరఫరా చేసేలా జలమండలి ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తోంది. ఒక ఫిల్లింగ్ స్టేషన్‌లో డిమాండ్ అధికంగా ఉండి.. దగ్గరలోని మరో ఫిల్లింగ్ స్టేషన్‌లో డిమాండ్ తక్కువగా ఉంటే అక్కడికి క్యాన్ నంబర్ ట్రాన్స్‌ఫర్‌తో సర్దుబాటు చేసేలా సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేస్తోంది.మరోవైపు ఫిల్లింగ్ స్టేషన్ నుంచి ట్యాంకర్ ట్రిప్ కూడా అక్రమంగా బయటకు వెళ్లకుండా కట్టడి చేసేందుకు బాధ్యులైన ఆపరేటర్‌పై భారీ జరిమానాలు విధించాలని నిర్ణయించింది. ప్రతి ఫిల్లింగ్ స్టేషన్ పనితీరుపై పర్యవేక్షణ æకోసం డీజీఎం స్థాయి అధికారిని నోడల్ అధికారిగా నియమించనుంది. ప్రతి ట్యాంకర్ బుకింగ్ ఎంసీసీ ద్వారానే జరిగే విధంగా చర్యలు చేపట్టనుంది.
రాత్రి పూట ప్రత్యేక షిఫ్ట్
రాతి వేళల్లో కమర్షియల్, బల్క్ వినియోగదారుల కోసం ట్యాంకర్లను సరఫరా చేసేలా ప్రత్యేకంగా షిఫ్ట్ నడిపించాలని జలమండలి నిర్ణయించింది. పగటి వేళల్లో గృహావసరాలకు మాత్రమే ట్యాంకర్లు సరఫరా చేసి రాత్రి వేళల్లో హోటళ్లు, రెస్టారెంట్లు, హాస్టళ్లు, ఆసుపత్రులు ఇతరత్రా వాణిజ్య అవసరాలకు సంబంధించి ట్యాంకర్లను సరఫరా చేసేలా చర్యలు చేపట్టనుంది. కాగా.. ఇప్పటికే ఐటీ సంస్కరణలతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో క్షేత్ర స్థాయి పనితీరు పర్యవేక్షిస్తున్న జలమండలి తాజాగా వేసవిలో తాగు నీటి సరఫరాపై కూడా డ్యాష్‌బోర్డు ద్వారా పర్యవేక్షణకు సిద్ధమైంది.
వేసవిలో సమర్థంగా తాగునీరు సరఫరా చేసేందుకు గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ముందస్తు సూక్ష్మ స్థాయి ప్రణాళికకు సిద్ధమయ్యాం. తాగు నీటిసమస్య ఉత్పన్నమయ్యే ప్రాంతాలు గుర్తించి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నాం. సూక్ష్మ స్థాయి పర్యవేక్షణతో ఎక్కడ కూడా తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటాం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa