తెలంగాణలో రాజకీయ పరిస్థితులు రోజురోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయి. అధికార ప్రతిపక్షాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితులు మారిపోయాయి. ఇదంతా సర్వసాధారణమే అయితే.. అధికార పక్షంలోనే ధిక్కార స్వరాలు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి. అందులోనూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు ప్రవీణ్ తీరు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. రేవంత్ రెడ్డి సర్కార్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన కులగణన సర్వే రిపోర్టుపై తీన్మార్ మల్లన్న స్పందించిన తీరుపై.. పార్టీ నాయకత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆయనకు షోకాజ్ నోటీసులు కూడా పంపించింది. కాగా.. తీన్మార్ మల్లన్న తీరుపై హస్తం నేతలు కూడా తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. నేతలంతా తీన్మార్ మల్లన్నపై మండిపడుతుండగా.. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం అతని గురించి మాట్లాడేంత టైం తన దగ్గర లేదని.. మాట్లాడటం కూడా వేస్ట్ అంటూ కొట్టిపారేస్తున్నారు.
యాదాద్రి జిల్లా భువనగిరిలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటించారు. టీపీసీసీ కార్యదర్శి పొత్నక్ ప్రమోద్ కుమార్ సతీమణి రోజా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. తీన్మార్ మల్లన్న విషయంలో తనకు మాట్లాడేంత సమయం లేదని.. మాట్లాడం కూడా వేస్ట్ అంటూ తీసిపారేయటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
అయితే.. తీన్మార్ మల్లన్నకు టీపీసీసీ, ఏఐసీసీ, క్రమశిక్షణ ఛైర్మన్ చిన్నారెడ్డి నోటీసులు ఇచ్చినట్లు పేపర్‌లో చూశానని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సర్వేలో 56.6 శాతం బీసీలు ఉన్నట్లుగా తేల్చినట్టు పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాలను అన్ని రంగాల్లో పైకి తీసుకొని రావడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పుకొచ్చారు.
స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే పార్టీ పరంగా కచ్చితంగా 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో కూడా వెనకడుగు వేసే ప్రసక్తి లేదని చెప్పుకొచ్చారు. 90 శాతం ఉన్న జనాభా కోసమే తెలంగాణ వచ్చిందని.. దొరలు, భూస్వాములు ఫాంహౌసుల్లో ఉండేందుకు కాదని మంత్రి తెలిపారు. ఫాంహౌస్‌లో ఉంటూ కులగణలో పాల్గొనకుండా ఉన్న వాళ్లకు మాట్లాడే హక్కు లేదని మండిపడ్డారు. బీఆర్ఎస్‌లా తాము హడావిడిగా సర్వే చేయలేదన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. తాము చేసిన సర్వే రిపోర్టును ప్రజల ముందు పెట్టామని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa