తెలంగాణలో గత మూడ్రోజులుగా అకాల వర్షాలు కురుస్తున్నాయి. వడగళ్ల వాన రైతులకు కడగండ్లు మిగుల్చుతున్నాయి. మార్చి 21 నుంచి 23 వరకు రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన వర్షాలతో పంట నష్టం వాటిల్లింది. వడగళ్ల వానతో పొట్ట దశలోని ధాన్యపు గింజలు, మామిడి పూత, కాయలు నేలరాలాయి. మొక్కజొన్న, వరి పంటలు నేలవాలిపోయాయి. ఇన్నాళ్లూ కంటిరెప్పలా కాపాడుకున్న పంట పది నిమిషాల్లో నేలపాలైదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కన్నీరు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో పంట నష్టాన్ని అంచనా వేయాలని రెండ్రోజుల క్రితం వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు.
తాజాగా.. వడగళ్ల వానలతో సంభవించిన పంట నష్టంపై ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక అందింది. 13 జిల్లాల్లోని 64 మండలాల్లో 11,298 ఎకరాల్లో నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. రాష్ట్రవ్యాప్తంగా 6,670 ఎకరాల్లో వరి, 4,100 ఎకరాల్లో మొక్కజొన్న పంటలకు నష్టం జరిగిందని చెప్పారు. 309 ఎకరాల్లో మామిడి, ఇతర పంటలకు తీవ్ర నష్టం జరిగిందని పేర్కొన్నారు. దీనికి సంబంధించి తుది నివేదిక రూపొందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. పూర్తి నివేదిక వచ్చాక పరిహారం చెల్లింపునకు చర్యలు చేపడతామని తుమ్మల తెలిపారు. అంటే మరో వారం రోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమయ్యే ఛాన్సు ఉంది.
ఇక రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణశాఖ అధికారులు అంచనా వేశారు. ఈ క్రమంలో 15 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. కరీంనగర్, భూపాలపల్లి, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, ములుగు, భద్రాద్రి, వరంగల్, జనగామ, సిద్దిపేట, రంగారెడ్డి, ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్‌లో వర్షాలు కురుస్తాయన్నారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటుగా పిడుగులు కూడా పడే సూచలను ఉన్నాయని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. కాగా, ఇప్పటికే అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు మళ్లీ వర్షాలనే వార్త కలవరపాటుకు గురి చేస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa