హైదరాబాద్ నగరంలోని నాన్‌వెజ్ ప్రియులకు బ్యాడ్‌న్యూస్. ఏప్రిల్ 10న మహావీర్ జయంతి సందర్భంగా నగరంలోని మాంసం దుకాణాలు మూసివేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆదేశించారు. ఈ మేరకు నగరంలోని చికెన్, మటన్, బీఫ్, ఫిష్ దుకాణాలు మూతపడనున్నాయి. జైన మత ప్రచారకుడు మహావీర్ జయంతి సందర్భంగా ఎల్లుండి మాంసం దుకాణాలు మూసివేయాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఇలంబర్తి ఆదేశాలు జారీ చేశారు. ఆ రోజు నగరంలోని చికెన్, మటన్, బీఫ్, ఫిష్ ఇతర మాంసం దుకాణాలు మూసి ఉండేలా చర్యలు తీసుకోవాలని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లకు సూచించారు. అహింసను పాటించే జైన మతస్తుల మనోభావాలను గౌరవిస్తూ వ్యాపారులు మాంసం దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేయాలని సూచించారు.
మహవీర్ జయంతి జైన మతంలో అత్యంత ముఖ్యమైన పండుగలలో ఒకటి. ఇది జైన మతం యొక్క 24వ, చివరి తీర్థంకరుడైన వర్ధమాన మహావీరుని జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని జరుపుకుంటారు. ఈ పండుగ రోజున మహావీరుడు బోధించిన అహింస, సత్యం, అస్తేయ, బ్రహ్మచర్యం, అపరిగ్రహ అనే ఐదు సూత్రాలను ప్రజలు స్మరించుకొని ఆచరిస్తారు. జైనులు మహవీర్ జయంతి రోజున ప్రత్యేక ప్రార్థనల చేస్తారు. మహావీరునికి తమ భక్తిని చూపించడానికి జైన దేవాలయాలను సందర్శిస్తారు. మహావీరుని విగ్రహాన్ని ఊరేగింపుగా రథంపై తీసుకువెళతారు. దీనిని రథ యాత్ర అని పిలుస్తారు. భక్తులు భజనలు, కీర్తనలు పాడుతూ ఊరేగింపులో పాల్గొంటారు.
మహావీరుని విగ్రహానికి పాలు, నీరు, ఇతర పవిత్ర ద్రవ్యాలతో అభిషేకం చేస్తారు. ఇది శుద్ధి, పునరుద్ధరణకు చిహ్నం. చాలా మంది జైనులు ఈ రోజున కఠిన ఉపవాసం ఉంటారు. ఆధ్యాత్మిక గ్రంథాలను చదువుతారు. పేదలకు, అవసరమైన వారికి ఆహారం, దుస్తులు, డబ్బును దానం చేయడం వంటి కార్యక్రమాలు చేపడతారు. మహావీరుని అహింసా సందేశాన్ని వ్యాప్తి చేయడానికి కొన్ని ప్రాంతాలలో శాంతియుత ర్యాలీలు కూడా నిర్వహిస్తారు. జైనులు ఈ రోజున పూర్తిగా శాకాహార, సాత్విక భోజనం తీసుకుంటారు. కొన్ని చోట్ల మహావీరుని జీవితం, బోధనల గురించి ఉపన్యాసాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. మెుత్తంగా మహవీర్ జయంతి జైన సమాజానికి ఒక ముఖ్యమైన, పవిత్రమైన రోజు. అందుకే నగరంలో మాంసం దుకాణాలు మూసివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa