ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైతులకు క్వింటాల్‌కు రూ.500 బోనస్, పంటల బీమా అమలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Apr 26, 2025, 08:50 PM

భారత్ సమ్మిట్ వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ ప్రభుత్వ ప్రాధాన్యతలు, చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్ ప్రణాళికలపై కీలక ప్రసంగం చేశారు. తమ ప్రభుత్వానికి రైతులు, మహిళలు, యువత అత్యంత ముఖ్యమైన భాగస్వాములని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలపాలన్నదే తమ లక్ష్యమని, 'తెలంగాణ రైజింగ్' పేరిట రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని తెలిపారు.తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వ్యవసాయానికి పెద్దపీట వేసిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రైతులకు కనీస మద్దతు ధరతో పాటు, వరి క్వింటాల్‌కు అదనంగా రూ.500 బోనస్ అందిస్తున్నామని, దీనివల్ల రైతులు లాభాలు ఆర్జిస్తున్నారని చెప్పారు. రైతు బీమాతో పాటు పంటల బీమా ద్వారా కూడా కర్షకులకు భరోసా కల్పిస్తున్నామన్నారు. యువత విద్య, ఉపాధి అవకాశాలపై ప్రత్యేక దృష్టి సారించామని, నైపుణ్యాలు లేని యువత కోసం 'యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ'ని ప్రారంభించామని తెలిపారు. తాము బాధ్యతలు స్వీకరించిన తొలి ఏడాదిలోనే 60,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని, స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు ఐదు లక్షల మంది యువతకు లబ్ధి చేకూరేలా 'రాజీవ్ యువ వికాసం' పథకాన్ని ప్రారంభించామని వివరించారు.తెలంగాణ సంస్కృతిలో మహిళలకు సమానత్వం, గౌరవం ఇస్తామని సీఎం ఉద్ఘాటించారు. రాష్ట్ర సాధన ఉద్యమంలో పురుషులతో సమానంగా మహిళలు పోరాడారని గుర్తుచేశారు. తమ ప్రభుత్వానికి మహిళలు అత్యంత ముఖ్యమని, రాష్ట్రంలో 67 లక్షల మంది సభ్యులతో మహిళా స్వయం సహాయక సంఘాలు బలంగా ఉన్నాయని తెలిపారు. కోటి మంది మహిళలను విజయవంతమైన వ్యాపారవేత్తలుగా, కోటీశ్వరులుగా తీర్చిదిద్దాలన్నదే తమ లక్ష్యమని వివరించారు. సౌర విద్యుత్ ప్లాంట్లు, ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్సులు, పెట్రోల్ బంకుల యాజమాన్యాన్ని మహిళలకు అప్పగించామని, ప్రీమియం రిటైల్ అవుట్‌లెట్లలో వారికి దుకాణాలు కేటాయించామని చెప్పారు. మహిళల సౌర విద్యుత్ కంపెనీల నుంచి వెయ్యి మెగావాట్ల సౌర విద్యుత్‌ను కొనుగోలు చేసేందుకు డిస్కంలు ఒప్పందాలు చేసుకున్నాయని, 600 బస్సుల నిర్వహణ బాధ్యత మహిళలకే ఇచ్చామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద తొలి ఏడాదిలోనే 4.50 లక్షల కుటుంబాలకు రూ.22,000 కోట్లు అందించామని, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కోసం 15 నెలల్లో రూ.5,000 కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు. గ్యాస్ సిలిండర్‌పై రూ.500 రాయితీ ఇస్తున్నామని కూడా తెలిపారు.విద్య, వైద్యం తమ ప్రభుత్వ ప్రాధాన్యతలని సీఎం స్పష్టం చేశారు. రూ.10 లక్షల వరకు ప్రభుత్వమే వైద్య ఖర్చులు భరించే రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం అమలు చేస్తున్నామని, సీఎం సహాయ నిధి ద్వారా ఏడాదిలో రూ.1,000 కోట్లు ఆరోగ్య సంరక్షణకు అందించామని తెలిపారు. కాలుష్య కాసారంగా మారిన 55 కిలోమీటర్ల మూసీ నదికి పునరుజ్జీవం కల్పిస్తున్నామని, భవిష్యత్తులో ఇది నగరానికే ప్రధాన ఆకర్షణగా మారుతుందని, వేల ఉద్యోగాలు సృష్టిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా మార్చేందుకు రీజినల్ రింగ్ రోడ్డు, మెట్రో విస్తరణ సహా అనేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు చేపడుతున్నామని వివరించారు.దాదాపు వందేళ్ల తర్వాత కుల గణన చేపట్టిన తొలి రాష్ట్రం తెలంగాణ అని సీఎం గర్వంగా ప్రకటించారు. బీసీల సాధికారత తమ ప్రభుత్వ విధానమని, దళితుల చిరకాల డిమాండ్ అయిన ఎస్సీ కోటా వర్గీకరణను అమలు చేశామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో థర్డ్ జెండర్‌ను నియమించిన తొలి ప్రభుత్వం కూడా తమదేనని, వారిని ఇతర శాఖల్లోకి కూడా తీసుకుంటామని చెప్పారు. పారదర్శక పాలన కోసం ప్రతి వారం 'ప్రజావాణి' నిర్వహిస్తున్నామని, ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరిస్తున్నామని తెలిపారు. పెట్టుబడుల ఆకర్షణకు అధిక ప్రాధాన్యమిస్తున్నామని, దావోస్, అమెరికా, జపాన్ వంటి దేశాల్లో పర్యటించి రూ.2.5 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించామని, తద్వారా ప్రైవేట్ రంగంలో యువతకు ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు.ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతినిధులు తెలంగాణ అభివృద్ధి గాథను, తమ దార్శనికతను, విజయాలను ప్రపంచానికి తెలియజేయాలని, 'తెలంగాణ రైజింగ్'కు బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa