హైదరాబాద్ నగరంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ 2025 పోటీల నుంచి మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ అకస్మాత్తుగా వైదొలగి, నిర్వాహకులపై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీపీఐ నారాయణ మరోసారి కీలక కామెంట్స్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం, మిస్ వరల్డ్ పోటీల నిర్వహకుల పట్ల మిస్ ఇంగ్లండ్ చేసిన సంచలన ఆరోపణలపై స్పందించిన సీపీఐ నారాయణ.. అందాల పోటీలు మంచివి కావని మరోసారి అన్నారు. ఆడవారిని కించపరిచే విధంగా ఉంటాయని తాను చెప్తే తన పట్ల విమర్శలు చేశారన్నారు. తాను అలా ఎందుకు అనాల్సి వచ్చిందో ఇప్పుడు అందరికీ అర్థమై ఉంటుందని అన్నారు.
కాగా, మిస్ వరల్డ్ పోటీల నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం చూపుతున్న ఉత్సాహంపై నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజా సమస్యలను పక్కనపెట్టి, ఉద్యోగుల జీతాలు పెంచకుండా, అందాల పోటీల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేయడం సిగ్గుచేటని ఆయన ధ్వజమెత్తారు. 'కోట్లల్లో ఖర్చు పెట్టేది సొల్లు కార్చుకోవడానికా?' అంటూ తీవ్ర వ్యాఖ్యులు చేశారు. అందాల పోటీలు మహిళలను అంగడి సరుకుగా, బహిరంగంగా వేలం వేయటం లాంటిదని, ఇది స్త్రీత్వం పవిత్రతకు అవమానకరమని నారాయణ అన్నారు. ప్రభుత్వాలు మహిళలను శక్తివంతం చేయడం, వారికి ఉపాధి అవకాశాలను సృష్టించడంలో దృష్టి పెట్టాలని, అందాల పోటీల ద్వారా అపవిత్రం చేయకూడదని ఆయన సూచించారు.
మిల్లా మాగీ సంచలన ఆరోపణలు..
మిస్ వరల్డ్ 2025 పోటీల నుంచి మిస్ ఇంగ్లాండ్ తప్పుకుంది. మొదట వ్యక్తిగత కారణాలు చెప్పినప్పటికీ.. ఆ తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన కామెంట్స్ చేశారు. పోటీల్లో తమను ధనవంతులైన స్పాన్సర్‌లను అలరించడానికి, వారితో విందులు చేయించడానికి బలవంతం చేశారని, ఇది తమను వేశ్యలుగా చూసినట్లుగా ఉందని మిల్లా మాగీ ఆవేదన వ్యక్తం చేశారు. ఆరుగురు పురుషులు ఉన్న టేబుల్‌కు ఇద్దరు అమ్మాయిలను కేటాయించి, వారిని ఎంటర్‌టైన్ చేయాలని ఒత్తిడి చేశారని ఆమె పేర్కొన్నారు.
తమను కేవలం ప్రదర్శన ఇచ్చే కోతులుగా చూస్తున్నారని, 'బ్యూటీ విత్ ఏ పర్పస్' అనే పోటీ స్ఫూర్తికి విరుద్ధంగా కేవలం అందం ప్రదర్శనకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శించారు. ఉదయం నుంచి రాత్రి వరకు భారీ మేకప్‌తో, బాల్ గౌనులతో ఉండాలని, బ్రేక్‌ఫాస్ట్‌కు కూడా వాటినే ధరించాలని నిర్వాహకులు చెప్పారని మిల్లా వెల్లడించారు. మిల్లా మాగీ ఆరోపణలపై మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ తీవ్రంగా స్పందించింది. ఆమె ఆరోపణలు నిరాధారమైనవని పరువు తీసేవి అని ఖండించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa