తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుంచి మంచిర్యాల వరకు ప్రయాణాన్ని సులభతరం చేసే దిశగా ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ప్రస్తుతం ఉన్న హైదరాబాద్-కరీంనగర్-రామగుండం రహదారి (హెచ్‌కేఆర్ రోడ్డు), లేదా రాజీవ్ రహదారికి ప్రత్యామ్నాయంగా కొత్త గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ నూతన రహదారికి సంబంధించి మూడు ప్రతిపాదనలు సిద్ధం కాగా.. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించిన సమీక్షలో ఒక ప్రతిపాదనకు సూత్రప్రాయ ఆమోదం లభించింది.
ప్రస్తుతం హైదరాబాద్ నుంచి మంచిర్యాల వరకు ఉన్న 207 కిలోమీటర్ల నాలుగు వరుసల రాజీవ్ రహదారి ప్రైవేటు కాంట్రాక్టర్ ఆధీనంలో ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2010లో పీపీపీ (పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్) విధానంలో ఈ రోడ్డు నిర్మాణం, నిర్వహణ కోసం ఒక సంస్థకు 25 ఏళ్ల కాలానికి (2036 ఫిబ్రవరి 14 వరకు) అప్పగించారు. ఈ సంస్థ టోల్ వసూలు, రోడ్డు నిర్వహణ బాధ్యతలు చూసుకుంటుంది. అయితే.. కాలక్రమేణా వాహనాల సంఖ్య గణనీయంగా పెరగడంతో.. ఈ రోడ్డుపై ట్రాఫిక్ సమస్య అధికమైంది.
ముఖ్యంగా జూబ్లీ బస్ స్టాండ్ నుంచి శామీర్‌పేట వరకు.. ఆ తర్వాత మంచిర్యాల వరకు ప్రయాణం కష్టతరంగా మారింది. అంతేకాకుండా.. ఈ రోడ్డులో ఉన్న మలుపుల కారణంగా ప్రమాదాలు కూడా ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత రోడ్డుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని ప్రభుత్వం సంబంధిత అధికారులను ఆదేశించింది. ఎన్‌హెచ్‌ఏఐ, ఆర్‌అండ్‌బీ అధికారులు మూడు ప్రతిపాదనలను ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించిన సమీక్షలో వివరించారు. ఈ ప్రతిపాదనల్లో మూడో ప్రతిపాదనకు సీఎం సూత్రప్రాయ ఆమోదం తెలిపారు.
మొదటి ప్రతిపాదనల్లో.. ప్రస్తుత రోడ్డుకు ఎడమవైపున 188 కిలోమీటర్ల దూరంతో ఉండే ఈ మార్గం శామీర్‌పేట నుంచి మొదలై తుర్కపల్లి, వర్గల్, దుబ్బాక, హరిదాసనగర్, కోనాయిపల్లి, దాతోజీపేట, అంతర్గాం మీదుగా మంచిర్యాల దగ్గరున్న ఎన్‌హెచ్-63కి అనుసంధానమవుతుంది. ఈ మార్గంలో శామీర్‌పేట చెరువు, అప్పర్ మానేరు డ్యామ్, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుల పరిధిలో నిర్మాణం చేపట్టాల్సి ఉన్నందున నిర్మాణ వ్యయం రూ. 4,700 కోట్లు అవుతుందని అంచనా.
రెండో ప్రతిపాదనల్లో.. ఇది శామీర్‌పేట నుంచే ప్రారంభమై నారాయణపూర్, ఎర్రవల్లి, తిమ్మాపూర్, కొమురవెల్లి, అంకుశాపూర్, నగునూర్, బస్వాపూర్, నవాబ్‌పేట, చిగురుమామిడి, తడికాల, మానేరు రివర్ క్రాసింగ్, కొలనూర్, వెన్నంపల్లి, ఏదులాపురం, లక్కారం నుంచి పుట్టపాక, కిస్టాపూర్, శ్రీరాంపూర్ మీదుగా మంచిర్యాల దగ్గరున్న ఎన్‌హెచ్-63కి కలుపుతారు. గ్రీన్‌ఫీల్డ్ విధానంలో 160 కి.మీ., జాతీయ రహదారుల అనుసంధానంగా మరో 46 కి.మీ. నిర్మాణం ఉంటుంది. ఈ మార్గంలో కొంతమేర అటవీ భూమి కావాల్సి ఉండగా, నిర్మాణానికి రూ. 4,000 కోట్లు అవసరమని పేర్కొన్నారు.
మూడో ప్రతిపాదనలో.. ఈ మార్గం శామీర్‌పేట నుంచి మొదలై నారాయణపూర్, కొమురవెల్లి దగ్గర ఎన్‌హెచ్-365బీ వరకు ఆప్షన్-2లో ఉన్న విధంగానే ఉంటుంది. ఆ తర్వాత చేర్యాల దగ్గరి నుంచి భైరాన్‌పల్లి, కన్నారం, ముల్కనూర్, ఎల్కతుర్తి, కమలాపూర్, మర్రిపల్లిగూడెం, టేకుమట్ల.. ఆ తర్వాత మానేరు డ్యామ్ క్రాస్ అయి ముత్తారం, పుట్టపాక, కిస్టాపూర్, శ్రీరాంపూర్ మీదుగా మంచిర్యాలకు దగ్గర్లోని ఎన్‌హెచ్-63కి కలుపుతారు.
దీని నిర్మాణానికి రూ. 3,000 కోట్ల నిధులు కావాల్సి ఉంటుందని అంచనా. ఈ మూడు ఆప్షన్లలో ఇదే ఉత్తమంగా ఉందని అధికారులు పేర్కొనడంతో సీఎం దీనికి సూత్రప్రాయ ఆమోదం తెలిపారు. మంచిర్యాల వరకు నిర్మించబోయే ఈ రోడ్డును భవిష్యత్తులో నాగ్‌పూర్ నుంచి విజయవాడ వరకు పలు భాగాలుగా నిర్మితమవుతున్న జాతీయ రహదారికి అనుసంధానం చేయనున్నారు. ఇది తెలంగాణతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల మధ్య రవాణాను మెరుగుపరుస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa