సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో డ్రగ్స్ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తూ పోలీసులు మరో కీలక విజయం సాధించారు. సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ (ఎస్ఓటీ) పోలీసులు ఓ డ్రగ్ సరఫరాదారుడని అరెస్టు చేసి, అంతర్జాతీయ మార్కెట్‌లో రూ. 3.5 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. గచ్చిబౌలిలోని కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి కేసు వివరాలను వెల్లడించారు.
అరెస్టు అయిన నిందితుడిని రాజస్థాన్‌కు చెందిన 26 ఏళ్ల వికాస్ సోహుగా గుర్తించారు. ఇతను 2019లో ఉపాధి కోసం హైదరాబాద్‌కు వలస వచ్చి, షాద్‌నగర్, రాయికల్‌లోని సంజుభాయ్ మార్వాడీ దాబాలో వాచ్‌మన్‌గా చేరాడు. ఆ తర్వాత వంటలు నేర్చుకుని అక్కడే కుకింగ్ మాస్టర్‌గా పనిచేయడం మొదలుపెట్టాడు. దాబా యజమాని సంజుభాయ్‌కి గంజాయి పీల్చే అలవాటు ఉండడంతో, వికాస్ మొదట అతడికి గంజాయి సరఫరా చేయడం ప్రారంభించాడు. క్రమంగా, దాబాకు వచ్చే లారీ డ్రైవర్లు, ఇతర వ్యక్తులకు కూడా అధిక ధరలకు గంజాయి విక్రయాలు మొదలుపెట్టాడు.
గంజాయిని ధూల్‌పేటకు చెందిన సలీం నుంచి కొనుగోలు చేసి, తన యజమానితో పాటు ఇతరులకు విక్రయించేవాడు. గత నెల 28న దాబా యజమాని సంజుభాయ్ అనారోగ్యంతో మృతిచెందడంతో, వికాస్ ఒక్కడే ఈ డ్రగ్స్ విక్రయాలను కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే, గత వారం గణ్‌పత్ అనే వ్యక్తి నుంచి 1.5 కిలోల హెరాయిన్, 750 గ్రాముల ఓపియం, 3.5 కిలోల పాపీ స్ట్రా (మత్తు పదార్థం) కొన్నాడు. అలాగే, ధూల్‌పేటకు చెందిన రాజు నుంచి 1.5 కిలోల గంజాయిని కూడా కొనుగోలు చేశాడు. కొంత డ్రగ్స్‌ను విక్రయించగా రూ. 89,700 నగదు వికాస్‌కు లభించింది.
పోలీసుల దాడులు, సీపీ విజ్ఞప్తి
మిగిలిన మాదకద్రవ్యాలను విక్రయించేందుకు వికాస్ ప్రయత్నిస్తుండగా.. పక్కా సమాచారం అందుకున్న శంషాబాద్ ఎస్‌వోటీ పోలీసులు, షాద్‌నగర్ పోలీసుల సహకారంతో దాబాపై ఆకస్మికంగా దాడి చేశారు. ఈ దాడిలో నిందితుడు వికాస్‌ను పట్టుకుని, అతడి నుంచి రూ. 3,50,27,700 విలువైన మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ భారీ పట్టివేత నగరంలో డ్రగ్స్ నెట్‌వర్క్‌కు గణనీయమైన నష్టాన్ని కలిగించింది.
డ్రగ్స్, గంజాయికి సంబంధించి ఏ సమాచారం ఉన్నా, వెంటనే స్థానిక పోలీసులు లేదా డయల్ 100కు ఫోన్ చేయాలని సీపీ అవినాష్ మహంతి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సమాచారం అందించిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని ఆయన హామీ ఇచ్చారు. యువతను మాదకద్రవ్యాల వ్యసనం నుంచి కాపాడేందుకు పోలీసులతో పాటు సమాజంలోని ప్రతి ఒక్కరూ సహకరించాలని సీపీ పిలుపునిచ్చారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం నిరంతరం కృషి చేస్తామని ఆయన పునరుద్ఘాటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa