ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపటి నుంచి ఆస్తుల రిజిస్ట్రేషన్ విధానంలో కీలక మార్పులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Jun 01, 2025, 09:01 PM

తెలంగాణ రాష్ట్రంలో ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. పారదర్శకత, వేగం, అవినీతి రహిత సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఆధార్-ఈ సంతకం విధానాన్ని ప్రవేశపెడుతోంది. దీని ద్వారా స్లాట్ బుకింగ్, రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత వేగవంతం అవుతుంది. తొలుత నిజామాబాద్ జిల్లాలోని ఆర్ముర్, ఖమ్మం జిల్లాలోని కూసుమంచి సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల్లో దీనిని విస్తరించనున్నారు.


రాష్ట్రంలోని మొత్తం 144 సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానం పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుంది. ఈ విధానం ప్రజలకు సులువైన, సమర్థవంతమైన సేవలను అందిస్తుందని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఇప్పటివరకు 47 సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రెండు విడతల్లో ప్రయోగాత్మకంగా స్లాట్ బుకింగ్ అమలు చేయగా.. తాజాగా జూన్ 2వ తేదీ నుంచి మిగిలిన 97 కార్యాలయాల్లోనూ ఈ విధానాన్ని ప్రారంభించనున్నారు. ఈ ఆదివారం స్టాంప్స్ & రిజిస్ట్రేషన్ అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించి ఈ వివరాలను వెల్లడించారు.


  స్లాట్ బుకింగ్ విధానం ఆస్తుల క్రయవిక్రయదారులకు సమయం ఆదా చేస్తుందని, పారదర్శకంగా, అవినీతి రహితంగా మెరుగైన సేవలను అందిస్తుందని మంత్రి అభిప్రాయపడ్డారు. ఈ విధానం సత్ఫలితాలను ఇచ్చిందని.. 94 శాతం మంది ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు. స్లాట్ బుకింగ్ వల్ల దాదాపు మూడు వేల డాక్యుమెంట్లు అధికంగా రిజిస్టర్ అయ్యాయని మంత్రి పేర్కొన్నారు. ప్రజల ఆలోచనలు, అభిప్రాయాలకు అనుగుణంగానే ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని, అంతిమంగా ప్రజలకు సంతృప్తికరమైన సేవలు అందించడమే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.


అన్ని సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలలో స్లాట్ బుకింగ్ విధానంతో పాటు.. AI చాట్‌బాట్‌ మేధాను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. 82476 23578 వాట్సాప్ నెంబర్ ద్వారా ఈ సేవలను పొందవచ్చు. ఈ నూతన ప్రక్రియ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకునే వారికి కలిగే సందేహాలు నివృత్తి అవుతాయి. రిజిస్ట్రేషన్ కార్యాలయం లొకేషన్, స్లాట్ బుకింగ్ ఖాళీల వివరాలు, సమయం లభ్యత వంటి సమాచారం కూడా లభిస్తుంది.


అక్రమాలకు అడ్డుకట్ట వేసేలా, లేఅవుట్‌లలో డబుల్ రిజిస్ట్రేషన్లు జరగకుండా ఉండేందుకు డెవలపర్ రిజిస్ట్రేషన్ మాడ్యూల్‌ను త్వరలో తీసుకువస్తామని మంత్రి తెలిపారు. ఈ మాడ్యూల్‌లో రిజిస్ట్రేషన్ అయిన ప్లాట్ల వివరాలు ఎరుపు రంగులో కనిపిస్తాయి.. తద్వారా పారదర్శకత పెరుగుతుంది. స్లాట్ బుకింగ్ విధానం వల్ల పనిభారం పెరిగిన పఠాన్‌చెరువు, యాదగిరిగుట్ట, గండిపేట, ఇబ్రహీంపట్నం, సూర్యాపేట, జడ్చర్ల, మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల్‌తో సహా తొమ్మిది సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అదనపు సబ్-రిజిస్ట్రార్‌లతో పాటు సిబ్బందిని నియమించారు.


ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ప్రతి కార్యాలయంలో రోజుకు 48 స్లాట్లు అందుబాటులో ఉంటాయి. స్లాట్ బుకింగ్ చేసుకోని వారి కోసం అత్యవసర సందర్భాలలో సాయంత్రం 5 నుంచి 5:30 గంటల వరకు ఐదు వాకిన్ రిజిస్ట్రేషన్లకు అనుమతి ఇచ్చారు. ఈ సమగ్ర మార్పులు తెలంగాణలో రిజిస్ట్రేషన్ సేవలను మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా అందిస్తాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa