తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్, గంజాయి నివారణకు కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. వాటి వాడకం మాత్రం పూర్తిగా తగ్గడం లేదు. గుట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. డ్రగ్స్‌తో పట్టుబడిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నా.. ఈ దందా ఆగడం లేదు. తాజాగా.. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో చోటుచేసుకున్న ఒక ఘటన డ్రగ్స్ వాడకం ఎంత లోతుగా పాతుకుపోయిందో మరోసారి స్పష్టం చేసింది. ఇక్కడ ఓ ఐటీ ఉద్యోగి పుట్టినరోజు పార్టీలో డ్రగ్స్ కలకలం రేపింది. పోలీసులు డ్రగ్స్‌తో పాటు అత్యంత విలువైన మద్యాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు.
చేవెళ్ల ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ..
చేవెళ్లలోని సెరీన్ ఆచార్జ్ ఫామ్‌హౌస్‌లో ఈ డ్రగ్స్ పార్టీ వెలుగు చూసింది. ఆదివారం సెలవు దినం కావడంతో.. కొంతమంది ఐటీ ఉద్యోగులు ఇక్కడ పుట్టినరోజు వేడుకలు చేసుకున్నారు. ఈ పార్టీలో డ్రగ్స్‌తో పాటు అత్యంత ఖరీదైన విదేశీ మద్యం వినియోగించారు. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు, ఫామ్‌హౌస్‌పై ఆకస్మిక దాడి చేసి డ్రగ్స్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
పోలీసులు స్వాధీనం చేసుకున్న మద్యం విలువ దాదాపు రూ. 2 లక్షలకు పైనే ఉంటుందని అంచనా వేశారు. అంతేకాకుండా, మూడు లగ్జరీ కార్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ పార్టీలో పాల్గొన్న ఆరుగురు ఐటీ ఉద్యోగులను అదుపులోకి తీసుకుని డ్రగ్స్ పరీక్షలు (డ్రగ్ టెస్ట్) నిర్వహించగా.. వారందరికీ పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. ఫామ్‌హౌజ్ నిర్వాహకుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ నివారణకు కట్టుబడి ఉంది. యువతను డ్రగ్స్ బారి నుండి రక్షించడానికి, ఈ అక్రమ కార్యకలాపాలను అరికట్టడానికి అనేక కార్యక్రమాలను చేపట్టింది. అందులో ముఖ్యమైనది ‘ఈగల్ (Enforcement, Awareness, and General Liaison with Experts - EAGLE)" ప్రోగ్రామ్. ఈ కార్యక్రమం ద్వారా డ్రగ్స్ నియంత్రణకు సమగ్ర విధానాన్ని అమలు చేస్తున్నారు. డ్రగ్స్ సరఫరా చేసే నెట్‌వర్క్‌లను గుర్తించి, వారిపై కఠిన చర్యలు తీసుకోవడం... డ్రగ్స్ విక్రయించేవారిని, వినియోగించేవారిని పట్టుకోవడం, కేసులు నమోదు చేయడం దీని ముఖ్య ఉద్దేశం.
డ్రగ్స్ వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజలకు, ముఖ్యంగా యువతకు, విద్యార్థులకు అవగాహన కల్పించడం.. పాఠశాలలు, కళాశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం వంటివి కూడా చేస్తారు. ఈగల్ ప్రోగ్రామ్ ద్వారా ప్రభుత్వం డ్రగ్స్ సమస్యను మూలాల నుంచి పరిష్కరించడానికి ప్రయత్నిస్తోంది. అయినప్పటికీ.. చేవెళ్ల ఘటన వంటి సంఘటనలు డ్రగ్స్ నివారణకు ఇంకా చాలా కృషి చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాయి. సమాజంలో డ్రగ్స్ పట్ల పూర్తి అవగాహన, పోలీసుల నిరంతర నిఘా ఉంటేనే ఈ సమస్యను పూర్తిగా నిర్మూలించవచ్చు. యువతను తప్పుడు మార్గంలో వెళ్లకుండా అడ్డుకోవడానికి.. వారికి సరైన మార్గదర్శకత్వం అందించడానికి ప్రభుత్వం, తల్లిదండ్రులు, విద్యాసంస్థలు సమన్వయంతో కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa