ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పంట నష్టపరిహారం చెల్లిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 04, 2025, 07:32 PM

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. దీని కారణంగా పలు జిల్లాలు వరదలకు గురయ్యాయి. ముఖ్యంగా కామారెడ్డి జిల్లా అతలాకుతలమైంది. గ్రామాలు నీట మునిగాయి. వందలాది కుటుంబాలు ఇళ్ళు కోల్పోయాయి. పంటలు పూర్తిగా నాశనం అయ్యాయి. ఈ పరిస్థితిని స్వయంగా పరిశీలించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు కామారెడ్డికి వెళ్లారు. తాడ్వాయి మండలంలోని ఎర్రపహాడ్ గ్రామానికి చేరుకున్న ఆయన.. వరద బాధితులను కలుసుకుని పరామర్శించారు. వరదల సమయంలో బలహీనంగా మారిన లింగంపల్లికుర్దు ఆర్ అండ్ బి బ్రిడ్జిని సీఎం పరిశీలించారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను కూడా ఆయన సందర్శించారు. ఇది కేవలం తాత్కాలిక మరమ్మతులతో సరిపెట్టకూడదని.. శాశ్వత పరిష్కారం కోసం పటిష్ట ప్రణాళికలు రూపొందించాలనే ఆదేశాలు అధికారులకు ఇచ్చారు.


భవిష్యత్‌లో ఇలాంటి సమస్యలు మళ్లీ రాకుండా ఉండేందుకు బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ లేదా బ్రిడ్జ్ కమ్ చెక్‌డ్యామ్ మాదిరి నిర్మాణాలు చేయగలమా అనే అంశంపై సవివరంగా అధ్యయనం చేయాలని సూచించారు. శాశ్వత ప్రణాళికలతోనే గ్రామీణ ప్రజలు భద్రతగా జీవించగలరని సీఎం అభిప్రాయం వ్యక్తం చేశారు. అనంతరం రైతులతో మాట్లాడిన ఆయనకు వారు తమ ఇబ్బందులను ఆవేదనతో వివరించారు.


పొలాల్లో ఇసుక మట్టిపాలైపోయినట్లు, వరదల వల్ల పంటలు పూర్తిగా నాశనం అయ్యాయని, గృహాలు కూడా మునిగిపోయి జీవనోపాధి దెబ్బతిన్నదని తెలిపారు. బాధాకర పరిస్థితిని విన్న సీఎం ప్రజలను ఓదార్చారు. ‘ప్రభుత్వం మీ వెంటే ఉంది. ఎవరినీ వదిలిపెట్టం. పంట నష్టానికి సరైన పరిహారం అందుతుంది. ఇళ్ళు కోల్పోయిన వారికి నివాసం కల్పిస్తాం. పొలాల్లో పేరుకుపోయిన ఇసుకను తొలగించేందుకు ప్రత్యేక నిధులు మంజూరు చేస్తాం’ అని భరోసా ఇచ్చారు. వరదల ప్రభావం ఇరిగేషన్ ప్రాజెక్టులపైనా పడింది. ముఖ్యంగా మైనర్, మేజర్ ప్రాజెక్టులు దెబ్బతిన్నాయి. అయితే పోచారం ప్రాజెక్టు భీకర వరదను తట్టుకుని నిలబడటంతో పెద్ద నష్టం తప్పిందని సీఎం పేర్కొన్నారు. తక్షణం మరమ్మతులు చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నామని సీఎం అధికారులను ఆదేశించారు.


"ఇది వందేళ్లలో చూడని వరద. కష్టం వచ్చినప్పుడు ప్రజలకు అండగా నిలిచే వాడే నిజమైన నాయకుడు. ఎల్లారెడ్డి నియోజకవర్గం ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆ కర్తవ్యాన్ని నిబద్ధతతో నిర్వర్తించారు. ఇకపై ప్రతి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతాం. అన్ని రకాల రోడ్లు, ప్రాజెక్టులు మరమ్మతు అవుతాయి. వ్యవసాయదారుల కష్టానికి తగిన పంటనష్టం పరిహారం ఇస్తాం. బాధిత కుటుంబాలు కోలుకునేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సమగ్ర నివేదిక సమర్పించాలి. బాధలు తీరే వరకు మా సహాయం ఆగదు" అని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ సందర్శనతో బాధితులు కొంత ధైర్యం పొందారు. ఇప్పటి వరకు తమను ప్రభుత్వం పట్టించుకోలేదని.. ఎవరూ పరామర్శకు కూడా రాలేదని బాధపడిన వారికి సీఎం భరోసాతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa