ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విద్యుత్ శాఖలో ఉద్యోగి.. గచ్చిబౌలిలో భవనం, ఇంట్లో రూ.2 కోట్ల నగదు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 16, 2025, 06:20 PM

తెలంగాణలో అవినీతి నిరోధక శాఖ ఇటీవల ముమ్మర దాడులు చేస్తోంది. ఎక్కడ లంచం డిమాండ్ లేదా అక్రమ ఆస్తుల సమాచారం వచ్చినా.. ఒక ఫోన్ కాల్ చేస్తే.. అక్కడే అధికారులు ప్రత్యక్షమవుతున్నారు. దీనివల్ల ప్రభుత్వ యంత్రాంగంలో భయభ్రాంతులు నెలకున్నాయి. తాజాగా విద్యుత్‌ శాఖ అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్ (ADE) అంబేడ్కర్ కూడా ఈ కేసులో భాగం అయ్యారు. అంబేడ్కర్‌పై ఆరోపణలు చిన్నవి కావు. ఆయన నివాసం, కుటుంబ సభ్యుల ఇళ్లు, బంధువుల ఇళ్లలో ఏసీబీ బృందాలు మంగళవారం తెల్లవారుజామునే సోదాలు ప్రారంభించాయి.


హైదారబాద్ లోని ఇబ్రహీంబాగ్‌లో పనిచేస్తున్న ఈ అధికారి దగ్గర ఆదాయానికి మించిన ఆస్తులు ఉండటమే కాకుండా.. ఆయన బంధువుల ఇంట్లో రూ.2 కోట్లు నగదు గుర్తించారు అధికారులు. అంతేకాక, మూడు ప్లాట్లు.. గచ్చిబౌలిలో ఖరీదైన భవనం కూడా ఏసీబీ దృష్టికి వచ్చాయి. ఏసీబీ డీఎస్పీ ఆనంద్ వెల్లడించిన వివరాలు చూస్తే.. ఆయన అవినీతి చిట్టా ఎంత విస్తృతమైందో అర్థమవుతుంది.


ఈ ఏడాది మొదటి ఎనిమిది నెలల్లోనే ఏసీబీ 179 కేసులు నమోదు చేసింది. వీటిలో 167 మంది ప్రభుత్వ ఉద్యోగులు వివిధ అవినీతి ఆరోపణలతో చిక్కుకున్నారు. ట్రాప్ కేసులు, క్రిమినల్ మిస్‌కండక్ట్, రహస్య దర్యాప్తులు ఇలా విభిన్న రకాలుగా ఈ కేసులు కొనసాగుతున్నాయి. ఉదాహరణకు ఆగస్టు నెలలోనే 31 కేసులు వెలుగుచూశాయి. అందులో 22 మంది అధికారులపై చర్యలు తీసుకున్నారు.


లంచం రూపంలో పట్టుబడిన మొత్తం రూ.2.82 లక్షలు కాగా.. ఇతర కేసుల్లో రూ.5.13 కోట్ల ఆస్తులు బయటపడ్డాయి. జనవరి నుంచి జూన్ 2025 వరకు 126 కేసులు నమోదు కాగా.. అందులో 125 ప్రభుత్వ అధికారులు అరెస్ట్ అయ్యారు. కొందరి వద్ద కోట్ల రూపాయల ఆస్తులు బయటపడటం, ఈ వ్యవస్థ ఎంత లోతుగా కూరుకుపోయిందో చెప్పవచ్చు.


ఈ చర్యలు అవినీతి చేసే అధికారులకు ఒక్క హెచ్చరిక మాత్రమే కాదు.. ఒక సంకేతం కూడా. లంచం తీసుకున్నప్పుడు “చాలా చిన్న విషయం” అని భావించే వారు ఇప్పుడు “ఎప్పుడైనా ఏసీబీ తలుపు తడుతుంది” అనే భయంతో వణికిపోతున్నారు. ఒకసారి దొరికిన తర్వాత జరిగే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి.


ఆస్తుల సీజ్, సస్పెన్షన్, అరెస్ట్, డిపార్ట్‌మెంటల్ విచారణలు, చివరికి ఉద్యోగం కోల్పోవడం వరకూ వెళ్తాయి. అంతేకాక.. కుటుంబ ప్రతిష్ట కూడా దెబ్బతింటుంది. ఇప్పటికే 2014 నుంచి 2024 వరకు దాదాపు 800 అవినీతి కేసులు తెలంగాణ ఏసీబీ దృష్టిలోకి వచ్చాయి. వాటిలో చాలావరకు డిపార్ట్ మెంటల్ ఎంక్వైరీలో భాగంగా జరిగాయి.


ప్రజలు తమ హక్కులను వినియోగించి.. ఫిర్యాదులు చేసి, ఏసీబీ సహకారం పొందగలిగితే అవినీతి తగ్గిపోతుంది. అవినీతిని అరికట్టడమే కాకుండా.. న్యాయవ్యవస్థ పటిష్టంగా ఉండాలంటే ప్రాసిక్యూషన్ అనుమతులు త్వరగా ఇవ్వడం, శిక్షలు ఖరారు చేయడం అత్యంత అవసరం. అవినీతి నిరోధక శాఖ కాల్ చేయాలంటే.. ఈ నంబర్ 1064లో సంప్రదించవచ్చు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa