ఖమ్మం, సూర్య బ్యూరో సెప్టెంబర్-24:రైతును రాజు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం కార్యాచరణ అమలు చేస్తుందని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.మంత్రివర్యులు, బుధవారం ఖమ్మం రూరల్ మండలం యం. వెంకటాయపాలెం గ్రామంలో 15 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న 9 వేల 700 మెట్రిక్ టన్నుల శీతల గోదాముల నిర్మాణానికి జిల్లా కలెక్టర్, సిపి లతో కలిసి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ* తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత 10 సంవత్సరాల కాలంలో గత పాలకులు గిడ్డంగుల సామర్థ్యం 3 లక్షల మెట్రిక్ టన్నుల పెంచితే, మన ప్రజా ప్రభుత్వం 5 లక్షలకు పైగా మెట్రిక్ టన్నుల గోదాముల నిర్మాణ పనులు చేపట్టిందని, రాబోయే 3 సంవత్సరాలలో వీటిని పూర్తి చేస్తామని అన్నారు. గిడ్డంగుల సంస్థ ద్వారా గతంలో ఎన్నడు లేని విధంగా మొట్టమొదటిసారిగా జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ గా కోల్డ్ స్టోరేజ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టామని, 9700 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో కోల్డ్ స్టోరేజ్ ను 15 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నామని, సంవత్సర కాలంలో కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం పూర్తి చేసి, వాణిజ్య పంటలు పండించే రైతన్నలకు ప్రైవేటు కంటే అతి చౌకగా కోల్డ్ స్టోరేజ్ అందుబాటు లోకి తీసుకుని వస్తామని అన్నారు.
రైతు భరోసా కింద పెట్టుబడి సహాయం ఎకరానికి 12 వేల రూపాయలకు పెంచడం జరిగిందని, 9 రోజులలో 9 వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాలో జమ చేయడం జరిగిందని, 25 లక్షల మంది రైతులకు 21 వేల కోట్ల రూపాయలు రైతుల రుణమాఫీ పూర్తి చేసామని, సన్న వడ్లకు మద్దతు ధరతో పాటు 500 రూపాయల బోనస్ అందించామని అన్నారు. రైతులను రాజు చేయడమే లక్ష్యంగా నాణ్యమైన విత్తనాలు పంపిణీ చేస్తున్నా మని అన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి వల్ల యూరియా సమస్య ఏర్పడితే ఢిల్లీలో రైతుల పక్షాన పోరాటం చేసి రైతులకు యూరియా సరఫరా చేసామని, రాబోయే వారం రోజులలో యూరియా సమస్య పరిష్కారం అవుతుందని అన్నారు.
ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన మాట మేరకు పేద ప్రజల ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ సరఫరా, ఉగాది నుంచి నిరుపేదలకు రేషన్ ద్వారా సన్న బియ్యం పంపిణీ, 11 లక్షల నూతన రేషన్ కార్డుల పంపిణీ చేశామని తెలిపారు.
గత పాలకులు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పేరుతో పేదలను మోసం చేస్తే మన ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో మొదటి విడతలో 4.5 లక్షల ఇండ్లు మంజూరు చేశామని, మిగిలిన అర్హులకు కూడా తదుపరి విడతల్లో తప్పని సరిగా ఇండ్లు మంజూరు చేస్తామని, మరో 3 సార్లు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని అన్నారు. ప్రతి సోమవారం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు నిధులు బ్యాంకు ఖాతాలలో జమ చేస్తున్నామని అన్నారు. అర్హులైన నిరు పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుందని అన్నారు.
కార్యక్రమంలో *జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ* 15 కోట్ల అంచనాతో చేపట్టిన కోల్డ్ స్టోరేజ్ నిర్మాణ పనులకు నేడు శంకుస్థాపన చేసుకోవడం సంతోషకరమని, కోల్డ్ స్టోరేజ్ కోసం అవసరమైన 10 ఎకరాల స్థలం కేటాయించడం జరిగిందని, మంత్రి ఆదేశాల మేరకు కోల్డ్ స్టోరేజ్ కు డబుల్ లైన్ రోడ్డు అనుసంధానం చేసేందుకు చర్యలు చేపడతామని అన్నారు. కోల్డ్ స్టోరేజ్ నిర్మాణంతో స్థానికంగా రైతులకు మేలు జరుగుతుందని, ఉద్యానవన శాఖ పంటల ఉత్పత్తి పెరుగుతుందని, మిర్చి రైతులకు కూడా కోల్డ్ స్టోరేజ్ ఉపయోగ పడుతుందని అన్నారు. రైతులు కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం కానున్న నేపథ్యంలో పంటల మార్పిడి విధానం అమలు చేయాలని, లాభాదాయక పంటల సాగు వైపు దృష్టి సారించాలని అన్నారు. పోలీస్ కమీషనర్ సునీల్ దత్ మాట్లాడుతూ* గిడ్డంగుల శాఖ ఆధ్వర్యంలో పెద్ద గోడౌన్ రైతులకు అందుబాటులోకి వచ్చి భవిష్యత్తులో రైతులు మార్కెట్లో పంట మంచి ధర సాధించేందుకు కోల్డ్ స్టోరేజ్ మంచి అవకాశం లభిస్తుందని అన్నారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు మాట్లాడారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఎండి కొర్ర లక్ష్మీ, ఆర్ అండ్ బి ఎస్ఇ యాకోబు, ఖమ్మం ఆర్డీవో నర్సింహారావు, పాలేరు నియోజకవర్గ ప్రత్యేక అధికారి రమేష్, పీఆర్ ఇఇ మహేష్ బాబు, ఖమ్మం రూరల్ మండల తహసీల్దార్ రాంప్రసాద్, వివిధ శాఖల అధికారులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa