భారత మీడియా, వినోద రంగం అద్భుతమైన వృద్ధి పథంలో దూసుకెళుతోంది. కంటెంట్, సృజనాత్మకత, సాంకేతికత కలయికతో ఈ రంగం ఆర్థిక వ్యవస్థకు కీలక చోదక శక్తిగా మారుతోంది. 2024లో రూ.2.5 లక్షల కోట్ల విలువ కలిగిన ఈ రంగం, రాబోయే మూడేళ్లలో అంటే 2027 నాటికి రూ.3 లక్షల కోట్ల మైలురాయిని అధిగమించనుందని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఛైర్మన్ అనిల్ కుమార్ లహోటి అంచనా వేశారు. ఫిక్కీ ఫ్రేమ్స్ 25వ సదస్సులో ఆయన మాట్లాడుతూ, ఈ రంగం భవిష్యత్తుకు సంబంధించిన కీలక అంశాలను పంచుకున్నారు.భారత ఆర్థిక వ్యవస్థలో మీడియా, వినోద రంగం ప్రాముఖ్యతను లహోటి ప్రత్యేకంగా ప్రస్తావించారు. గతేడాది ఈ రంగం నుంచి రూ.2.5 లక్షల కోట్ల ఆదాయం సమకూరగా, అందులో కేవలం టెలివిజన్, ప్రసార విభాగం వాటాయే దాదాపు రూ.68,000 కోట్లుగా ఉందని ఆయన తెలిపారు. అనలాగ్ నుంచి డిజిటల్, అక్కడి నుంచి 4K ప్రసారాల వరకు ఈ రంగం సాంకేతికంగా ఎంతో పరిణితి సాధించిందని అన్నారు. స్మార్ట్ టీవీలు, 5G టెక్నాలజీ, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల రాకతో వినియోగదారుల సంఖ్య 60 కోట్లు దాటిందని, ఇది అసాధారణమైన మార్పు అని పేర్కొన్నారు. అయితే, ఈ డిజిటల్ విప్లవం కొనసాగుతున్నప్పటికీ, దేశంలోని 190 మిలియన్ల గృహాల్లో ఇప్పటికీ సంప్రదాయ లీనియర్ టెలివిజన్‌దే ఆధిపత్యమని ఆయన గుర్తుచేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa