యువ ఆపద మిత్రులు సిద్ధమయ్యారు. హైడ్రాలో వారం రోజుల శిక్షణను పూర్తి చేసుకున్నారు. ఆపద సమయంలో ఎలా తనను తాను రక్షించుకోవాలో.. చుట్టు పక్కల వారిని ఎలా కాపాడాలో తెలుసుకున్నారు. ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు మొదటి రెస్పాండెంట్‌గా ఎలా స్పందించాలో అవగాహన తెచ్చుకున్నారు. హైడ్రా ఆధ్వర్యంలో యువ ఆపద మిత్ర శిక్షణ పూర్తి చేసుకున్న 78 మంది వాలంటీర్లకు మంగళవారంహైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు ధ్రువపత్రాలను అందజేశారు. NDMA (నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ) ప్రారంభించిన యువ ఆపద మిత్ర పథకంలో భాగంగా నిజామాబాద్ లోని గిరిరాజు ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి ఎంపికైన 78 మంది వాలంటీర్లకు గత బుధవారం హైడ్రాలో శిక్షణ ప్రారంభమైన విషయం విధితమే. వారం రోజుల శిక్షణ పూర్తయిన సందర్భంగా హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు వారితో మాట్లాడారు. శిక్షణ ఎలా జరిగింది.. ఏం నేర్చుకున్నారో నేరుగా వారినే అడిగి తెలుసుకున్నారు.
సాధన చేస్తే సాధించలేనిది ఏమీ ఉండదని యువ ఆపద మిత్ర వాలంటీర్లకు హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు సూచించారు. వారం రోజుల హైడ్రా శిక్షణలో నేర్చుకున్న అంశాలతో పాటు.. మీరు గొప్ప వ్యక్తులుగా ఎదిగేందుకు అవసరమైన నైపుణ్యాలను పెంచుకోవడంలో కూడా పూర్తి అవగాహనతో ముందుకు వెళ్లాలన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న మీరంతా యువ ఆపద మిత్రులు.. మీ ప్రత్యేకతను చాటాలని సూచించారు. ప్రమాద సమయంలో గందరగోళానికి గురి కాకుండా.. తక్షణ సహాయకులుగా రంగంలోకి దిగాలన్నారు. తర్వాత వివిధ విభాగాలకు చెందిన వారితో సమన్వయంతో పని చేయాల్సి ఉంటుందన్నారు. అందుకే క్షేత్ర స్థాయిలో పరిస్థితులను కూడా ఈ శిక్షణలో భాగం చేశామన్నారు. తోటివారికంటే మీరు ముందుండడమే కాదు.. సహచరులకు కూడా అవగాహన కల్పించి ఆపద సమయంలో మీతో కలసి పని చేసేలా సిద్ధం చేయాలని హైడ్రా కమిషనర్ సూచించారు. జిల్లాల్లో కూడా ఇలాంటి శిక్షణ ఉంటే బాగుంటుందని విద్యార్థినులు చేసిన సూచనలను కూడా పరిగణనలోకి తీసుకుంటామన్నారు. ప్రతి ఒక్కరికీ ఈ శిక్షణ అవసరముందని చెప్పారు.
హైడ్రా కమిషనర్ ఆదేశాలమేరకు.. యువ ఆపద మిత్ర వాలంటీర్లకు క్షేత్ర స్థాయిలో కూడా పలు విషయాలపై అవగాహన కల్పించామని హైడ్రా అధికారులు వివరించారు. అగ్ని ప్రమాదంలో ఒకే ఇంట్లో 17 మంది ప్రాణాలు కోల్పోయిన పాతబస్తీ గుల్జార్ హౌస్ ప్రాంతానికి తీసుకెళ్లామన్నారు. బతుకమ్మ కుంటలో బోటు ద్వారా వరదల్లో చిక్కుకున్నవారిని ఎలా కాపాడాలో, ప్రథమ చికిత్స ఎలా అందించాలో వివరించాం. వంటింటి ప్రమాదాలతో పాటు అగ్ని ప్రమాదాల నివారణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ప్రాక్టికల్ గా చెప్పామన్నారు. వాతావరణ శాఖ కార్యాలయానికి తీసుకెళ్లి.. వాతావరణ సమాచారాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.. ఐసీసీసీ(కమాండ్ కంట్రోల్ రూం)లో తెలంగాణ వ్యాప్తంగా నిఘా వ్యవస్థ ఎలా పని చేస్తోందనే విషయాలు చూపించామని చెప్పారు. హైడ్రా అదనపు సంచాలకులు శ్రీ వర్ల పాపయ్యగారు, అడిషనల్ కమిషనర్ శ్రీ ఆర్. సుదర్శన్ గారు, ఆర్ ఎఫ్ వో శ్రీ జయప్రకాష్ గారు, డీఎఫ్‌వో శ్రీ గౌతమ్ గారు, ఏడీఎఫ్‌వో మోహనరావుతో పాటు.. ఎస్ ఎఫ్ వోలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
హైడ్రా శిక్షణలో అనేక విషయాలు తెలుసుకున్నామని యువ ఆపద మిత్ర వాలంటీర్లు తెలిపారు. బయట ప్రపంచాన్ని చూశామన్నారు. ప్రభుత్వ విభాగాలు ఎలా పని చేస్తున్నాయో తెలుసుకున్నామని చెప్పారు. ఈ వారం రోజుల పాటు నేర్చుకున్న లైఫ్ స్కిల్స్ జీవితాంతం ఉపయోగపడే విధంగా ఉన్నాయన్నారు. ప్రమాద సమయంలో గందరగోళానికి గురి కాకుండా.. ఎలా స్పందించాలి,. ఎలా నివారించాలి.. అనే విషయాలు క్షుణ్ణంగా తెలుసుకున్నాం. పాఠ్యాంశాల బోధన కూడా ఇలా జరిగితే.. ఎంతో ఉపయోగంగా ఉంటుందని వాలంటీర్లు తెలిపారు. తరగతి గదిలో విషయాలను విని.. క్షేత్రస్థాయిలో ప్రాక్టికల్‌గా తెలుసుకున్నామన్నారు. ఈ శిక్షణతో మాలో ఎంత ధైర్యం వచ్చింది. మాతో పాటు తోటివారిని రక్షించే విధంగా మేమంతా సిద్ధమయ్యామని సంతృప్తి వ్యక్తం చేశారు. క్రమశిక్షణ, తోటివారితో ఎలా మాట్లాడాలి ఇలా అనేక అంశాలు తెలుసుకున్నాం.. హైడ్రా అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారితో రెండుసార్లు కలిసే అవకాశం రావడం.. ఈ సందర్భంగా చెప్పిన మాటలు జీవితాంతం గుర్తుండిపోతాయని వాలంటీర్లు చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa