ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చైనీస్ మాంజాపై ఉక్కుపాదం,,,, మరోసారి సజ్జనార్ వార్నింగ్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 06, 2026, 09:16 PM

'చైనా మాంజా దాచుకున్నా, అమ్మినా, వాడినా... చట్టం ఊరుకోదు, లోపలేస్తది!' అంటూ హైదరాబాద్ సీపీ సజ్జనార్ మరోసారి మాస్ వార్నింగ్ ఇచ్చారు. సంక్రాంతి పండుగ వేళ గాలిపటాలు ఎగురవేయడం ఆనవాయితీగా వస్తున్నా.. ఆ సరదా ఇతరుల ప్రాణాలకు శాపంగా మారకూడదన్నారు. పర్యావరణానికి, పక్షులకు, వాహనదారులకు ప్రాణసంకటంగా మారిన 'చైనీస్ మాంజా' వాడకంపై ఉక్కుపాదం మోపుతామని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు నిషేధిత మాంజా విక్రేతలు, వినియోగదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించారు.


చైనీస్ మాంజాను విక్రయించినా.. రహస్యంగా నిల్వ ఉంచినా.. పర్యావరణ పరిరక్షణ చట్టం-1986 ప్రకారం కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని సీపీ హెచ్చరించారు. ఈ ప్రమాదకరమైన మాంజాను ఇతర రాష్ట్రాల నుండి నగరానికి చేరవేస్తున్న ట్రాన్స్‌పోర్ట్ ఏజెన్సీలు, పార్శిల్ సర్వీసులపై కూడా నిఘా పెంచామని, నిబంధనలు అతిక్రమిస్తే ఏజెన్సీ యజమానులను సైతం నిందితులుగా పరిగణిస్తామని తెలిపారు. నగరంలోని అన్ని జోన్లలో టాస్క్‌ఫోర్స్, స్థానిక పోలీసులు నిరంతరం ఆకస్మిక దాడులు నిర్వహిస్తారని వెల్లడించారు.


చైనీస్ మాంజా తయారీలో ప్లాస్టిక్, సింథటిక్ పదార్థాలతో పాటు గాజు పెంకుల మిశ్రమాన్ని పూతగా వాడతారు. దీనివల్ల గాలిపటాలు ఎగురవేసే పిల్లల వేళ్లు తెగిపోవడమే కాకుండా, వాహనదారుల మెడలకు చుట్టుకుని ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని సీపీ వివరించారు. అలాగే ఈ మాంజాలో ఉండే మెటాలిక్ పదార్థాల వల్ల విద్యుత్ తీగలకు తగిలినప్పుడు విద్యుత్ షాక్ తగిలే అవకాశం ఉందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు కేవలం సంప్రదాయ నూలు దారాలను మాత్రమే అందించి పర్యావరణ హితంగా పండుగ జరుపుకునేలా చూడాలని కోరారు.


నగర పౌరులు కూడా ఈ సామాజిక బాధ్యతలో భాగస్వాములు కావాలని సీపీ పిలుపునిచ్చారు. ఎక్కడైనా నిషేధిత మాంజా విక్రయాలు జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే డయల్ 100 లేదా హైదరాబాద్ పోలీస్ వాట్సాప్ నెంబర్ +91 9490616555 కు సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. పక్షుల స్వేచ్ఛను, మనుషుల ప్రాణాలను కాపాడుతూ పండుగను ఆనందంగా జరుపుకోవాలని ఆయన సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa