తెలంగాణలో త్వరలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు వేగవంతం చేసింది. తాజాగా 2026 మున్సిపల్ ఎన్నికల కోసం వార్డుల వారీగా ఓటర్ల తుది జాబితాను ప్రకటించింది. ఈ జాబితా ప్రకారం.. పురుషుల కంటే మహిళా ఓటర్ల సంఖ్య పలు చోట్ల ఎక్కువగా ఉండటం గమనార్హం. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరగనున్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మొత్తం 52,43,023 మంది ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల కమిషన్ వెల్లడించింది. అందులో పురుష ఓటర్లు 25,62,639 మంది, మహిళా ఓటర్లు 26,80,014 మంది ఉన్నారని తెలిపింది. ఇక ట్రాన్స్‌జెండర్లు 640 మంది ఉన్నట్లు పేర్కొంది.
ఎన్నికల సంఘం విడుదల చేసిన తుది ఓటర్ల జాబితా ప్రకారం.. నిజామాబాద్ కార్పొరేషన్‌లో అత్యధికంగా 3,48, 051 మంది ఓటర్లు ఉన్నారు. ఆ తర్వాత స్థానంలో మొత్తం 3,40,580 మంది ఓటర్లతో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో రెండో స్థానంలో నిలిచింది. ఇక అత్యల్పంగా కొత్తగూడెం కార్పొరేషన్‌లో 1,34,775 మంది ఓటర్లు ఉన్నారు. మున్సిపాలిటీల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో అత్యధికంగా 1,43,655 మంది ఓటర్లు ఉన్నారు. అమరచింత మున్సిపాలిటీలో అత్యల్పంగా 9,147 మంది ఓటర్లు ఉన్నారు.
త్వరలో ఎన్నికల నోటిఫికేషన్..
రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల తుది జాబితా ప్రకటించిన నేపథ్యంలో జనవరి 20న మున్సిపల్ ఎలక్షన్స్‌కు నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు.. ఇతర ప్రధాన పార్టీల నేతలు ఈనెల 16 నుంచే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల కోసం పురపాలకశాఖ కసరత్తు ముమ్మరం చేసింది. ఈ ఓటర్ల జాబితా ఆధారంగా వార్డుల వారీగా రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ చేపట్టనుంది. జనాభా ప్రాతిపదికన వార్డులు, డివిజన్లు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల రిజర్వేషన్లను ఖరారు చేయనుంది. ఆ తర్వాత నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. కాగా, తెలంగాణలోని 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లు ఎన్నికలకు సిద్ధమయ్యాయి.
ఫిబ్రవరి చివరి నాటికి కొత్త పాలకమండళ్లు..!
కాగా, ఈ మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను ఫిబ్రవరి మూడో వారంలోగా పూర్తి చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఆ తర్వాత ఫిబ్రవరి చివరి నాటికి కొత్త పాలక మండళ్లకు పురపాలన బాధ్యతలు అప్పగించేలా కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa