ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు....కండువా కప్పుకుంటే ఒక్కొక్కరికి రూ.20 వేలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 07, 2026, 08:24 PM

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీల అభ్యర్థులు వ్యూహాలు రచిస్తున్నారు. ఇక ఎన్నికల వేళ మద్యం, డబ్బు ఏరులై పారుతోంది. కొన్నిచోట్ల అయితే రాజకీయం అసలు రంగు బయటపడుతోంది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో మొత్తం 20 వార్డులుంటాయి. ఈ మున్సిపాలిటీలో మూడు చోట్ల పోటీ రసవత్తరంగా సాగుతుంది. ఇక్కడ అభ్యర్థులు ఖర్చుకు ఏమాత్రం వెనుకాడటం లేదు. ఎంతైనా ఖర్చు చేసేందుకు సిద్ధమవుతున్నారు.


ఓ వార్డులో కండువా కప్పుకొని యువకులు ప్రచారం చేస్తే ఒక్కొక్కరికి రూ.20 వేల చొప్పును స్పాట్ పేమెంట్ ఇస్తున్నాడుఓ ప్రధాన పార్టీ అభ్యర్థి. ప్రత్యర్థి కూడా ఏమాత్రం వెనక్కి తగ్గటం లేదు. అంతే పెద్ద మొత్తంలో నగదు ఇస్తానని ఆశచూపుతున్నాడు. దీంతో ఉదయం ఒక పార్టీలో ఉంటే.. సాయంత్రానికి మరోక పార్టీలో చేరిపోతున్నారు సదరు యువకులు. అటుఇటు పార్టీలు మారుతున్నారు. మరో రెండు వార్డుల్లోనూ పార్టీ కండువాలను కప్పుకొంటే రూ.10వేల వరకు ఇస్తున్నారు. భలే మంచి బేరం దొరికిందంటూ యువకులు సొమ్ము చేసుకుంటున్నారు.


ఇక మున్సిపల్ ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో శ్రీమంతులు పోటీలో నిలిచారు. స్థిరాస్తి, మైనింగ్, కాంట్రాక్టర్లు, మద్యం వ్యాపారాల్లో ఉన్నవారు పోటీకి సై అంటున్నారు. గతంలో ప్రజా జీవితంలో ఉన్నవారు, రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న ఫ్యామిలీల నుంచే పోటీ చేసేవారు. ప్రస్తుతం రూటు మారింది. ఎన్నికలంటే ఖర్చుతో కూడిన వ్యవహారం. దీంతో బాగా డబ్బున్న వారు ఎన్నికల్లో పోటీ చేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. దీంతో సమాజం పట్ల అవగాహన, సేవాభావం కలిగిన వారు డబ్బులేనిదే రాజకీయం చేయలేమని పోటీకి వెనకడుగు వేస్తున్నారు. ఈ డబ్బు రాజకీయాలు మన వల్ల కాదని ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నారు.


రాష్ట్రంలో ఫిబ్రవరి 11న ఎన్నికలు జరగనుండగా.. ఫిబ్రవరి 13న కౌంటింగ్ జరగనుంది. ఫిబ్రవరి 16న మేయర్లు, డిప్యూటీ మేయర్లు, ఛైర్‌పర్సన్లు, వైస్‌పర్సన్లు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల్లో 2,996 వార్డులకు 12,944 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa