ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆరు కొత్త జోన్లతో గ్రేటర్‌ 'హైదరాబాద్‌'.. కార్పొరేషన్లుగా సైబరాబాద్, మల్కాజిగిరి..!

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 07, 2026, 08:53 PM

హైదరాబాద్ మహానగర పాలక సంస్థ పరిధిని మరింత విస్తరిస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ చుట్టూ ఔటర్ రింగు రోడ్డు పరిధిలోని 27 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలను జీహెచ్ఎంసీలో విలీనం చేశారు. నగర శివార్లలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పన, మెరుగైన రవాణా సౌకర్యాలు, ఏకీకృత అభివృద్ధి లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.


 అయితే రాజధాని హైదరాబాద్‌లో గ్రేటక్ కార్పొరేషన్ ఒక్కటే ఉండనుంది. ప్రస్తుతం 300 డివిజన్లతో దేశంలోనే అతి పెద్ద మహానగరంగా విస్తరించిన జీహెచ్‌ఎంసీని ఫిబ్రవరి 10న మూడు కార్పొరేషన్లుగా ప్రభుత్వం విభజించనుంది. జీహెచ్‌ఎంసీ, మల్కాజిగిరి కార్పొరేషన్‌, సైబరాబాద్‌ కార్పొరేషన్‌ పేర్లతో ఇవి ఏర్పాటు కానున్నట్లు తెలుస్తోంది. జీహెచ్‌ఎంసీలో శంషాబాద్, రాజేంద్రనగర్, గోల్కొండ, సికింద్రాబాద్‌, చార్మినార్, ఖైరతాబాద్ జోన్లు, మల్కాజిగిరి కార్పొరేషన్‌‌లో మల్కాజిగిరి, ఉప్పల్‌, ఎల్బీనగర్ జోన్లు, సైబరాబాద్‌ కార్పొరేషన్‌లో కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్‌ జోన్లు ఉండనున్నట్లు సమాచారం.


ఇటీవల జీహెచ్‌ఎంసీ 12 జోన్లు, 60 సర్కిళ్లు, 300 డివిజన్లతో అతిపెద్ద నగరపాలక సంస్థగా ఏర్పాటు చేశారు. ప్రస్తుత జీహెచ్‌ఎంసీని 70 లక్షల జనాభాతో కూడిన ఆరు జోన్లకు పరిమితం చేసేందుకు రెడీ అవుతున్నారు. సగటున 35లక్షల జనాభా ఉండేట్లు.. మల్కాజిగిరి, సైబరాబాద్‌ కార్పొరేషన్లను మూడు జోన్ల చొప్పున ఏర్పాటు చేయాలని ప్రభుత్వం చూస్తోంది. పాత జీహెచ్‌ఎంసీలో దాదాపు కోటి మంది జనాభా ఉండేది. ప్రస్తుత 27 మున్సిపాలిటీల విలీనం తర్వాత జీహెచ్‌ఎంసీలో 1.34కోట్ల మంది జనాభా ఉంది. గతంలో 150 డివిజన్లు ఉండగా.. డివిజన్ల పునర్విభజనలో అవి ప్రస్తుతం 300కు పెరిగాయి. పాత హైదరాబాద్ నగరంలో జనాభా అధికంగా ఉన్నందున.. డివిజన్ల సంఖ్య దాదాపు రెట్టింపయింది. గ్రేటర్‌ హైదరాబాద్‌లో విలీనమైన 27 పట్టణ స్థానిక సంస్థల పరిధిలో జనాభా అంతంతమాత్రంగానే ఉంది.


ఇక నగరంలో 17 ఏళ్ల తర్వాత ప్రత్యేక అధికారి పాలన రాబోతుంది. పాలకమండలి పదవీ కాలం అయిపోతే.. మేయర్‌కు సమాన హోదాలో ప్రభుత్వం స్థానిక సంస్థలకు స్పెషల్ ఆఫీసర్లను నియమించి పరిపాలనను కొనసాగిస్తుంది. చివరి సారిగా 2008 సెప్టెంబరు 4 నుంచి 2009 డిసెంబరు 4 వరకు ఎస్‌.పి.సింగ్‌ జీహెచ్ఎంసీ కమిషనర్, ప్రత్యేక అధికారి హోదాలో పరిపాలన చేపట్టారు. తాజాగా మరోసారి ప్రత్యేక అధికారి పాలనలోకి జీహెచ్ఎంసీ వెళ్లనుంది. ఈనెల10తో ప్రస్తుత పాలకమండలి పదవీ కాలం ముగుస్తుండగా.. ఎన్నికలు జరిగే వరకు స్పెషల్ ఆఫీసర్ పాలన సాగనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa