‘నిమిషంలో లోన్’ ‘అరగంటలో మీ ఖాతాల్లోకి నగదు జమ’ అంటూ సామాజిక మాధ్యమాల్లో ఆకర్షించే ప్రకటనలు సామాన్యుల పాలిట యమపాశాలుగా మారుతున్నాయి. తాజాగా, హైదరాబాద్‌లో లోన్ యాప్ అరాచకం వెలుగుచూసింది. లోన్ యాప్‌లు ఓ వ్యక్తి నుంచి ఐదు నెలల్లో ఏకంగా రూ.36 లక్షలు అధిక వడ్డీని వసూలు చేయడం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే.. సనత్ నగర్‌కు చెందిన ఆయుర్వేద వైద్యుడు గతేడాది ఆగస్టులో గూగుల్ ప్లే స్టోర్ నుంచి లోన్ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకున్నాడు. ‘లోన్ రాడార్’, ‘క్విక్ ఫండ్స్’ యాప్‌ల నుంచి తొలుత చిన్న మొత్తంలో రుణం తీసుకుని, సకాలంలో చెల్లించాడు. అతడు నిజాయితీగా తిరిగి రుణం తీర్చడాన్ని ఆసరాగా చేసుకున్నారు. అతడు రుణం కోసం రిక్వెస్ట్ చేయకుండానే ఆయన అకౌంట్‌లోకి భారీ మొత్తంలో నగదు జమ చేయడం ప్రారంభించారు.
వారం రోజులు గడువని చెప్పి,.. ఆరో రోజు నుంచే తమ అసలు స్వరూపాన్ని లోన్ యాప్ నిర్వాహకులు బయటపెట్టారు. అతడి వ్యక్తిగత సమాచారాన్ని యాప్ ద్వారా తస్కరించారు. యాప్‌లు డౌన్‌లోడ్ చేసిన సమయంలోనే బాధితుడి అనుమతితో అతడి కాంటాక్ట్ లిస్ట్, గ్యాలరీని నిర్వాహకులు యాక్సెస్ చేసుకున్నారు. ఆ వ్యక్తి ఫోన్ నుంచి తీసుకున్న ఫొటోలను అభ్యంతరకరంగా మార్ఫింగ్ చేసి.. డబ్బు కట్టకుంటే వాటిని బంధువులు, ఫ్రెండ్స్‌కు పంపుతామని బెదిరింపులకు పాల్పడ్డారు.
అలా అయితే తన పరువు పోతుందని బాధితుడు భయపడిపోయాడు. మానసిక వేధింపులతో గతేడాది సెప్టెంబర్ నుంచి ఈ ఫిబ్రవరి మధ్య ఐదు నెలల్లో పలు విడతల్లో మొత్తం రూ.64.16 లక్షలు కట్టాడు. అసలు రూ.28 లక్షలు తీసుకుంటే.. కేవలం వడ్డీలు, పెనాల్టీల రూపంలోనే రూ.36.16 లక్షలుగా వసూలుచేశారు. చివరకు సైబర్ క్రైమ్ పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, వెరిఫైడ్ కాని యాప్‌లను ఫోన్‌లలో డౌన్‌లోడ్ చేయడం, ఉపయోగించడం ఎంత ప్రమాదకరమో ఈ ఘటన తెలియజేస్తోంది. సోషల్ మీడియాలో ప్రకటనలతో జనాలను ఆకర్షించి, నిండా ముంచేస్తున్నారు. లోన్ యాప్ వేధింపులకు తాళలేక చాలా మంది బలవన్మరణాలకు పాల్పడిన ఘటనలు ఉన్నాయి. అందుకే ఆర్బీఐ గుర్తింపు పొందిన బ్యాంకులు, యాప్‌లను మాత్రమే వాడటం సురక్షితమని భావించాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa