భద్రాచలం రామాలయం ప్రాంగణంలోని చిత్రకూట మండపంలో గురువారం ప్రధానార్చకులు సీతారామానుజాచార్యులు సమక్షంలో ప్రత్యేక పూజలు చేశారు. బంగారు పూతతో తయారు చేయించిన పన్నెండు వాహనాలను ఈ మండపంలో వేంచేయింప చేసి అంకురార్పణ క్రతువు నిర్వహించారు. ఎన్ఆర్ఐ వాసవీ అసోసియేషన్ ఆధ్వర్యంలో తమిళనాడులోని కుంబకోణంలోని నిపుణులు ద్వాదశ వాహనాలను తయారు చేశారు. ఈ దాతల సమక్షంలో సంప్రదాయబద్ధంగా హనుమంత, సార్వభౌమ, కల్పవృక్షం, హంస, గజ, చంద్ర ప్రభ, సూర్యప్రభ, గరుడ, సింహ, సింహాసనం, అశ్వ, శేష వాహనాలకు ప్రాణ ప్రతిష్ఠా మహోత్సవం పూజలను కొనసాగించారు. శుక్రవారం ద్వాదశ దివ్య వాహన ప్రతిష్ఠా మహోత్సవాన్ని నిర్వహిస్తారు. ఇందులో కొన్ని వాహనాలలో రాములవారు తిరువీధి సేవకు వెళ్లనున్నారు. మిగతావి వరుసగా ఆలయం నుంచి తాతగుడి కూడలి వరకు వెళ్లి భక్తులకు దర్శనమిస్తాయి. 4న సార్వభౌమ సేవను ప్రత్యేకంగా చేయనున్నారు. ఈవో రమాదేవి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.