పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గం మక్కువ మండలం శంబర గ్రామంలో వేంచేసియున్న శంబర శ్రీ పోలమాంబ అమ్మవారి ఆలయాలకు భక్తుల తాకిడి పెరిగింది. మంగళవారం అమ్మవారికి పవిత్ర దినం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి పూజలు జరిపించి, ముడుపులు మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఒడిస్సా రాష్ట్రం రాయిఘడతో పాటు విశాఖ, శ్రీకాకుళం జిల్లాల నుండి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి వనం గుడిలో అమ్మవారికి మొక్కుబడులు చెల్లించుకున్నారు. శ్రీ అమ్మవారి జాతర పూర్తయి సుమారు ఆరు మాసాలకు కావస్తున్నప్పటికీ ఆలయాలకు భక్తులు తాకిడి ఇంకా తగ్గలేదు. శ్రీ పోలమాంబ అమ్మవారి జాతర ను రాష్ట్ర గిరిజన జాతరగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో శ్రీ పోలమాంబ అమ్మవారి ఆలయాలకు ప్రాముఖ్యత మరింత పెరిగింది.
దీంతో అమ్మవారిని ఆలయాలు నిత్యం భక్తులతో కలకలాడుతున్నాయి. సుధీర ప్రాంతాల నుండి వాహనాల్లో భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి, శ్రీ పోలమాంబ అమ్మవారికి ముడుపులు మొక్కుబడులు చెల్లించుకున్న పిదప, వనం గుడి సమీప తోటలో బంధుమిత్ర కుటుంబ సమేతంగా ఆనందంగా ఉత్సాహంగా వంటలు వార్పులు చేసుకొని సాయం సమయానికి స్వస్థలాలకు బయలుదేరుతున్నారు. ఆలయ కార్య నిర్వహణ అధికారి వి రాధాకృష్ణ ఆధ్వర్యంలో సిబ్బంది తగు ఏర్పాట్లు చేపడుతున్నారు. మంగళవారం అమ్మవారికి పవిత్ర దినం కావడంతో సమీప సరాయి వలస గ్రామం నుండి వచ్చిన భక్తులు వనం గుడి ముందు కోలాటం నిర్వహించారు.