ట్రెండింగ్
Epaper    English    தமிழ்

16.07.2023 నుండీ 22.07.2023 వరకూ ద్వాదశ రాశి ఫలములు

Astrology |  Suryaa Desk  | Published : Sun, Jul 16, 2023, 10:33 AM

1) మేషరాశి.... (అశ్విని, భరణి,  కృతిక 1వ పాదం) (నామ నక్షత్రములు: చూ, చే ,చొ, లా,లీ,  లూ, లే, లో,ఆ)

వారం ప్రారంభంలో  ఉత్సాహంగా ఉంటారు చిన్న ప్రయాణాలు చేస్తారు కుటుంబంలో సోదరీ సహకారం బాగుంటుంది, ఆర్థికంగా తండ్రి గారు, విదేశాలలో ఉండే మిత్రులు సహకరిస్తారు. తల్లి తరపు బంధువులను కలుస్తారు, గృహ మార్పుకే ఆలోచనలు చేస్తారు. వాహన కొనుగోలు కొరకై ఆత్మీయులను కలిసి చర్చిస్తారు. వారం మధ్యలో రాజకీయ నాయకుల, ఉన్నతాధికారులను వృత్తిపరమైన విషయాలలో సంప్రదిస్తారు. పోటీ పరీక్షల   కొరకు విద్యార్థులు విశేషంగా కృషి చేస్తారు. వారం చివరిలో సంతాన అభివృద్ధి విషయంలో కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఆలోచనలు వికసిస్తాయి. కొత్త పెట్టుబడి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇష్టమైన వారి కోసం అధికంగా ఖర్చు చేస్తారు. ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవాలి.  ఆధ్యాత్మిక బలం పెంచుకునే ప్రయత్నాలు చేస్తారు. మంచి ఫలితాల కొరకు సుబ్రమణ్య స్వామి ఆరాధన మంచిది.

2) వృషభరాశి...(కృతిక 2,3,4 పాదాలు, రోహిణి,మృగశిర 1,2 పాదాలు) (నామ నక్షత్రములు:ఈ, ఊ, ఎ, ఓ, వా, వీ, వూ, వె, వో)  

వారం ప్రారంభంలో ఆర్థిక సంబంధమైన విషయాలలో, ఇతరులతో వ్యవహరించే అంశాలలో జాగ్రత్తలు తీసుకుని వలెను. వాగ్దానాల అంశాలలో, ఆకస్మిక ఖర్చులలో  నిదానము అవసరం. వారం మధ్యలో మిత్రులు తోబుట్టువులు సహకరిస్తారు ధైర్యం పెరుగుతుంది,  కుటుంబ వ్యక్తుల, పలుకుబడి కలిగిన రాజకీయ నాయకుల సహకారంతో సొంత నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. సంతాన అభివృద్ధి కరంగా ఉంటుంది. సంతానం  వారి నిర్ణయాల విషయంలో, మీరు ఆలోచించి ముందుకు వెళ్లడం అవసరం. వారం చివరిలో వాగ్వాదాలకు దూరంగా ఉండాలి. తోబుట్టువులతో కలిసి దీర్ఘకాలికి పెట్టుబడులకై ఆలోచనలు చేస్తారు. ఆరోగ్యముపై తగ్గిన శ్రద్ధ అవసరము. నూతన అంశాలు తెలుసుకుంటారు సమయానికి ఆహార స్వీకరణ మంచిది. విద్యార్థులు విద్యా విషయాలలో తగిన శ్రద్ధ చూపాలి. ఎలక్ట్రానిక్ పరికరాలు కొనుగోలు, నూతన పరిచయాల వలన  ఖర్చులు అధికము. మంచి ఫలితాల కొరకు అమ్మవారి ఆరాధన , దేవాలయ సందర్శన మంచిది.

3) మిధున రాశి...(మృగశిర 3,4  పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) (నామ నక్షత్రములు: కా, కి, కూ, ఖం , జ్ఞ, చ్చ, కే, కో, హ, హి)  

వారం ప్రారంభంలో మనసు ప్రశాంతత తక్కువగా ఉంటుంది కొత్త ఆలోచనలు చేస్తారు. మీ ఆలోచనలు మీకు విస్మయాన్ని కలిగిస్తాయి. ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉంటాయి. సంఘంలో గౌరవనీయమైన వ్యక్తుల, విదేశీ వ్యక్తుల నూతన పరిచయాలు, పలుకుబడి పెరుగుతుంది. వారం మధ్యలో సమయస్ఫూర్తిగా నిర్ణయాలు తీసుకుంటారు, ఉన్నత పదవులలో పలుకుబడి కలిగిన వ్యక్తుల సహకారంతో కొత్త పెట్టుబడుల కొరకు ఆలోచిస్తారు. బంధుమిత్రులను కలుస్తారు. బ్యాంకింగ్ మొదలైన పోటీ పరీక్షల కోసం సిద్ధమవుతారు. వారం మధ్యలో ప్రయాణాలు లభిస్తాయి, నూతన పరిచయాలు, ధైర్యం పరాక్రమం పెరగడం, భూ సంబంధ అంశాలలో ఆశించిన ఫలితాలు. సంతానం సంబంధ విషయంలో ఎంతగానో ఎదురు చూస్తున్నా వార్త అందుతుంది. వృత్తిపరంగా అభివృద్ధి. మంచి ఫలితాల కొరకు విష్ణుమూర్తి దేవాలయాల సందర్శించడం మంచిది.

4) కర్కాటక రాశి...(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) (నామ నక్షత్రములు: హి, హూ, హే, హో, డా, డీ ,డూ, డే, డో)

వారం ప్రారంభంలో ఇష్టమైన వస్తువులకు కొనుగోలు కొరకు అధికవ్యయం. వృత్తిపరమైన అలసట, ప్రశాంతత తక్కువ, నిద్రలేమి. శారీరక శ్రద్ధ అవసరము. అయినప్పటికీ చురుకుగా ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకుంటారు. వింతగా విడ్డూరంగా మాట్లాడుతూ అందరిని ఆకట్టుకుంటారు. సమయ స్ఫూర్తిగా ఆలోచిస్తారు. వారం మధ్యలో పౌరుషం కోపం కొంత పెరుగుతుంది. నాయకత్వ లక్షణాలు, దర్పంగా ఉంటారు. వ్యాపార రంగంలో వారు సహకరిస్తారు. విద్యార్థులకు అనుకూలం. విదేశీ విద్య కొరకై చేయు ఆలోచనలు కొలిక్కి వస్తాయి. వారం చివరిలో ఆర్థిక విషయాలు గృహ సంబంధ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కోపాన్ని నియంత్రించుకోవాలి, మాటల వలన అపార్థులకు అవకాశం ఎక్కువ. రుణముల కొరకు ప్రయత్నాలు చేస్తారు. వస్త్రములు ,షాపింగ్ కొరకు ఆకస్మిక ఖర్చులు. మంచి ఫలితములు కొరకు సాయిబాబా మందిరము దర్శించటమేలు.

5) సింహరాశి...(మఖ, పుబ్బ, ఉత్తర 1వ  పాదం)  (నామ నక్షత్రములు: మా, మీ, మూ, మే, మో, టా, టీ, టూ, టే)

ప్రారంభంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది, చురుకుగా ఉత్సాహంగా ఉంటారు. చాలాకాలంగా ఎదురుచూస్తున్న వార్త అందుకుంటారు. సంతాన అభివృద్ధి కరంగా ఉంటుంది. చిన్ననాటి మిత్రులను కలుస్తారు. సభలకు సమావేశాలకు హాజరు అవుతారు. సమయాన్ని సద్వినియోగపరుచుకుంటారు. దూర ప్రయాణాలు చేస్తారు. ఇష్టమైన  ఆత్మీయుల కొరకు అధిక ఖర్చులు చేస్తారు. అవసరమైన వారి కొరకు విరాళాలు ఇస్తారు. విదేశీ ప్రయాణ విషయంలో కొత్త నిర్ణయానికి వస్తారువారం మధ్యలో. విద్యార్థులకు విద్యాసంబంధ ప్రయాణాలు ఉంటాయి. వారము చివరిలో వ్యక్తిగత శ్రద్ధ ఆకర్షణ పెరుగుతుంది. సహకరించరు అనుకున్న వ్యక్తుల సహకారం ఆనందాన్నిస్తుంది. లలిత కళలపై ఆసక్తిని పెంచుకుంటారు. దూర ప్రాంతాల్లో ఉండే గురువుల ఆశీస్సులు అందుకుంటారు. విదేశీ అవకాశాల ప్రయత్నాలు, తొందరపాటు నిర్ణయాలు తగవు. కుటుంబ సభ్యులతో అపార్ధాలు లేకుండా ముందుకు వెళ్లాలి. మంచి ఫలితాల కొరకు గణేష్ మందిరాల సందర్శన మంచిది.

6) కన్యా రాశి...(ఉత్తరఫల్గుణి 2 3 4  పాదాలు, హస్త  4వ పాదం, చిత్త 1 2  పాదాలు) (నామ నక్షత్రములు: టో , పా, పి, పూ , షం , ణా, పే,పో)

వారం ప్రారంభంలో వృత్తి పరంగా అభివృద్ధి ఉంటుంది. అలసట బడలిక కొత్త బాధ్యతలు. శక్తివంచన లేకుండా మీ విధానంలో మీరు బాధ్యతాయుతంగా పనులు నెరవేరుస్తారు. స్వ గ్రామానికి వెళ్లడానికి ఆలోచనలు చేస్తారు. వారం మధ్యలో వృత్తిలో ఆదాయం అభివృద్ధి, ఉన్నత అధికారుల ప్రశంసలు.  రాజకీయంగా పలుకుబడి కలిగిన వ్యక్తుల సహాయ సహకారంతో నూతన నిర్ణయాలకు శ్రీకారం చుడతారు. పడిన కష్టానికి ప్రతిఫలాన్ని పొందుతారు. బ్యాంకింగ్, హోమియో రంగంలో ఉండే వారికి అనుకూలం. విద్యార్థులకు అనుకూలమైన వాతావరణం. వారం చివరిలో స్త్రీలతో విభేదాలకు దూరంగా ఉండాలి. ప్రయాణాలలో జాగ్రత్తలు అవసరం. కొత్త వ్యక్తులు యాలలో  ఆచితూచి అడుగు వేయాలి. వాహనాలు నడిపేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో ఆత్మీయులను సంప్రదించాలి. మంచి ఫలితాల కొరకు సుబ్రహ్మణ్య స్తోత్రం పటించుట మేలు.

7) తులారాశి...(చిత్త 3 4  పాదాలు, స్వాతి, విశాఖ 1 2 3  పాదాలు) (నామ నక్షత్రములు: రా, రి, రూ, రె, రో, తా, తీ, తూ, తే)    

వారం ప్రారంభంలో సంఘ సేవ బాగా చేస్తారు. పెద్దల ఆశీస్సులు ఉంటాయి. దూర ప్రయాణాలు కొరకు ఆలోచిస్తారు. ఆధ్యాత్మిక వాతావరణం ఉంటుంది. తెలియని అసంతృప్తి. ప్రశాంతత లోపం. అధిగమించడానికి పుణ్యబలాన్ని పెంచుకోవాలి.    వారం మధ్యలో వృత్తిపరమైన ప్రయాణాలు, అలసట అధిక బాధ్యతలు. అయినప్పటికీ అభివృద్ధి కరంగా ఉంటుంది. ఉన్నత స్థాయి అధికారులు ప్రశంసిస్తారు. అధికారంలో ఉండే వ్యక్తి సహకారం లభిస్తుంది. నూతన వృత్తుల కొరకు ప్రయత్నించే నిరుద్యోగులకు కొంత అనుకూలమైన సమయం. వృత్తిలో గౌరవం పెరుగుతుంది. శ్రమకు తగ్గ ఆదాయాన్ని అందుకుంటారు. వారం చివరిలో ఆరోగ్యం బాగుంటుంది శారీరక శ్రద్ధ పెరుగుతుంది ఆకర్షణీయమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆశించిన లాభాలను ఆర్జిస్తారు. భాగస్వామికి అనుకూలముగా ఉంటుంది. భూ సంబంధ కొనుగోలు విషయాలలో ఆలోచనలు చేస్తారు. మంచి ఫలితాల కొరకు సూర్య ఆరాధన మంచిది.

8) వృశ్చిక రాశి...(విశాఖ  4వ పాదం, అనురాధ, జేష్ఠ 1 2 3 పాదాలు) (నామ నక్షత్రములు: తో, నా, నీ, నూ, నె, నో, యా, యీ, యు)   

వారం ప్రారంభంలో ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. అనుకోని వ్యక్తుల విమర్శలు, కొత్త వ్యక్తుల జోక్యం ముఖ్య అంశాలలో  చికాకును పెంచుతాయి. అనవసర ప్రయాణాలు, ఖర్చులు, ముఖ్యమైన పనులు వాయిదా కొంత అశాంతిని పెంచినప్పటికీ అసంతృప్తికి లోను కాకుండా ధైర్యంగా ముందుకు వెళతారు. సమయానికి ఆహార స్వీకరణ, విశ్రాంతి అవసరం. వాగ్వాదాలకు దూరంగా ఉండుట మేలు. వారం మధ్యలో రావలసిన లాభాలలో, భూమి, గృహ  సంబంధిత ఆర్థిక అంశాలలో, కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. సమయానికి మాట సహాయం చేయవలసిన ఆత్మీయులు మొహం చాటు వేయడంతో కొంత ఇబ్బంది ఎదురైనప్పటికీ మీ పనులు మీరు చేసుకుంటూ ముందుకు వెళతారు. విద్యార్థులు ఎక్కువ శ్రద్ధతో చదవాలి. కొత్త రుణముల కొరకు ప్రయత్నాలు చేస్తారు. వారం చివరిలో వృత్తిపరంగా బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. అధికారంలో ఉండే స్త్రీలతో, మరియు భాగస్వామితో వీలైనంత వినయ విధేయతలతో అపార్థములు లేకుండా సహకారాన్ని పొందాలి. మీదైన భూ సంబంధ అంశాలలో నష్టపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మంచి ఫలితముల కొరకు శ్రీకృష్ణ మందిరములు దర్శించుట మేలు

9) ధను రాశి...(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ  పాదం) (నామ నక్షత్రములు: యే, యో, భా,భీ, భూ, ధ, ఫ, డా, భే)     

వారం ప్రారంభంలో వ్యాపార, వృత్తిపరమైన భాగస్వాము లతో ఘర్షణ లేకుండా వ్యవహరించి నిర్ణయాలు తీసుకోవాలి. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. కళాకారులకి దూర ప్రదేశాలలో అవకాశములు. ఆధ్యాత్మిక ఆలోచనలు చేస్తారు. వారం మధ్యలో భాగస్వామి ఆరోగ్య విషయంపై తగిన శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యమైన పనుల యందు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. వృత్తిపరంగా విమర్శలకు అవమానాలకు లోను కాకుండా జాగ్రత్తలు అవసరం. ఒక సమాచారం చిరాకును కలిగిస్తుంది. పనులలో ఆలస్యాలు, ఆటంకాలు ఎదురైనప్పటికీ సంయమనం పాటించాలి. వృత్తిపరంగా అధికారులను, రాజకీయంగా పలుకుబడి కలిగిన వ్యక్తుల్ని కలవడానికి ప్రయత్నాలు చేస్తారు. వీలైనంత  వినయముగా ముందుకు వెళ్ళుట అవసరము. వారం చివరిలో తండ్రిగారి ఆరోగ్యం, సలహాలపై  శ్రద్ధ అవసరము. ఉపాసనతో పుణ్య బలమును పెంచుకోవాలి. సంతానము విద్యపై, అభివృద్ధిపై శ్రద్ధ చూపిస్తారు. గృహ, వాహన రిపేర్లకి ఖర్చు. మంచి ఫలితములు కొరకు రామాలయ సందర్శన మంచిది.


10) మకర రాశి...(ఉత్తరాషాఢ 2 3 4  పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1 2  పాదాలు) (నామ నక్షత్రములు: భో , జా , జి, ఖి,ఖు, ఖే, ఖో, గా, గి)

వారం ప్రారంభంలో విద్యార్థులు పోటీ పరీక్షల కొరకు బాగా ప్రిపేర్ అవుతారు. పాత రుణములు చెల్లిస్తారు. శత్రువులపై విజయం సాధిస్తారు ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. తల్లి తరపు బంధువులతో  ఒక విషయాన్ని చర్చిస్తారు. వారం మధ్యలో గౌరవము గుర్తింపు పెరుగుతుంది. అవార్డులు అందుకుంటారు. ఆత్మీయుల గ్రామానికి ప్రయాణం చేస్తారు. పెద్దలతో విభేదాలు రాకుండా ముందుకు వెళ్లాలి. వృత్తిపరంగా భాగస్వామితో తాత్కాలికంగా ఎడబాటు. నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. నూతన సంస్థలలో వృత్తుల కొరకు ప్రయత్నాలు చేస్తారు. సంతానానికి ప్రభుత్వపరమైన వృత్తి కొరకు ప్రయత్నాలు ముందుకు వెళతాయి. వారము చివరిలో కొత్త ప్రదేశాలలో వృత్తిపరంగా ఆకస్మిక అవకాశాలు, స్త్రీ సంతాన సహకారం బాగుంటుంది. భూ సంబంధమైన దీర్ఘకాలిక పెట్టుబడుల కొరకు ఆలోచనలు చేస్తారు. మిత్రులతో షాపింగ్ లు ఖర్చులు అధికంగా ఉంటాయి. ఆరోగ్య, ఆహార విశ్రాంతి విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవాలి. అవసరము అయితే వైద్యున్ని సంప్రదించాలి. మంచి ఫలితాల కొరకు దుర్గాదేవి ఆరాధన మంచిది.

11) కుంభ రాశి...(ధనిష్ట 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1 2 3  పాదాలు) (నామ నక్షత్రములు: గూ, గే, గో, సా, సి, సు, సే, సో, దా)    

వారం ప్రారంభంలో స్పెక్యులేషన్ మొదలైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. సంతానం పోటీ పరీక్షల్లో అధిక శ్రద్ధ చూపిస్తారు. ఆత్మీయుల కొరకు ఆకస్మిక ఖర్చు ఉంటుంది. సభలు సమావేశాల్లో పాల్గొంటారు. వారం మధ్యలో సంతానానికి వృత్తిపరమైన విషయాలలో నూతన అవకాశాలు, ప్రభుత్వపరమైన వృత్తి కొరకు ప్రయత్నం చేసే వారికి సహకారం అందుతుంది, ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. ఆశించిన ఫలితాలు పొందుతారు. పాత బకాయిలు కొంతవరకు చెల్లిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. కృషి శీలత పెరుగుతుంది, రహస్య శత్రువులపై విజయం సాధిస్తారు. వృత్తిలో అభివృద్ధితోపాటు కొత్త అవకాశాలు ఆనందాన్ని కలిగిస్తాయి. వారం చివరిలో వివాహ ప్రయత్నాలు లో కొంత ఆలస్యాలు అవరోధాలు చికాకు తెప్పిస్తాయి.  భాగస్వామి తో అభిప్రాయ భేదములు, అపార్థములు రాకుండా జాగ్రత్త వహించాలి. స్త్రీలతో మాట్లాడేటప్పుడు వీలైనంత వినయముగా మాట్లాడటం మంచిది. స్త్రీలు తమ ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. మంచి ఫలితముల కొరకు అమ్మవారి ఆరాధన, దేవాలయ సందర్శన మంచిది.


12) మీన రాశి...(పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి) (నామ నక్షత్రములు: దీ , దు, ఇ+, ఝ, ధా, దే, దో, చా, చి)

వారం ప్రారంభంలో విద్యార్థుల హాస్టల్ వసతి కొరకు ప్రయత్నాలు బాగా చేస్తారు. గృహంలోని వాతావరణం ఆశించిన స్థాయిలో సంతృప్తిని ఇవ్వదు. విద్యార్థులు విద్య పై ఆసక్తిని, జ్ఞాపక శక్తిని పెంచుకోవాలి. నూతన అంశాలు తెలుసుకుంటారు. సమయమునకు తగిన ఆహార స్వీకరణ మంచిది. వారం మధ్యలో భాగస్వామి, సంతానమునకు ప్రభుత్వపరమైన అవకాశములు కొరకు ప్రయత్నాలు, ఆలోచనలు ఫలిస్తాయి. ఉపాసన బలం పెరుగుతుంది. ఆధ్యాత్మిక అంశముల కొరకు చేయు ప్రయత్నాలు యందు అవరోధాలు అధిగమించే ప్రయత్నాలు చేయాలి. ఎంతో కాలం ఎదురు చూస్తున్నా ఒక ముఖ్యమైన సమాచారాన్ని అందుకోగలుగుతారు. వారం చివరిలో ధైర్యం పెరుగుతుంది పరాక్రమం పెరుగుతుంది ముఖ్యమైన విషయాల విజయాన్ని సాధిస్తారు. రుణములు చెల్లిస్తారు, క్రొత్త రుణముల కొరకు చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. వ్యక్తుల సహకారం ఆశించినట్టుగా ఉంటుంది. తోబుట్టువులైన స్త్రీలతో మాట్లాడే సందర్భములో కలహములు రాకుండా జాగ్రత్తగా వ్యవహరించుకోవాలి. మంచి ఫలితములు కొరకు వెంకటేశ్వర స్వామి దేవాలయాలు సందర్శన మంచిది.

(గమనిక: వ్యక్తిగత జాతకము అనగా వ్యక్తి పుట్టి నపుడు అతని సమయం, స్థలం, జన్మ వివరాలు ఆధారముగా నిర్మించిన జన్మకుండలి ప్రకారము వ్యక్తికి నడుస్తున్న దశలు, అంతర్దశలు ప్రధానము. గోచారం ఫలితాలు చూసుకునేటప్పుడు ప్రధానముగా వ్యక్తిగత  జాతకము లోని దశ  అంతర్దశలు కూడా కలిపి చూసుకోవాలి. గోచార రీత్యా రాశి ఫలాలు అశుభము గా ఉండి దోషాలు ఉన్నప్పటికీ, జననకాల దశ ఫలములు శుభము గా ఉంటే  రాశి   ప్రస్తుత అశుభ ఫలితాలు స్వల్పంగానే ఉంటాయి. చిన్న చిన్న పరిహారాలు పాటించి శుభ ఫలితాలు పొందగలరు)






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com