ఉద్యోగుల భవిష్యత్తుకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ అందిస్తోంది. యాజమాన్యాలు తమ కంపెనీల్లో పని చేసే ఉద్యోగుల పేరిట వారి ఈపీఎఫ్ ఖాతాల్లో నెల నెల డబ్బులు జమ చేస్తుంటాయి. ఉద్యోగి వేతనం నుంచి 12 శాతం పీఎఫ్ ఖాతాకు వెళ్తాయి. అలాగే యాజమాన్యాలు సైతం తమ వాటా చెల్లిస్తుంటాయి. ఇలా చెల్లించిన డబ్బులు ఏకమొత్తంగా ఉద్యోగి పదవీ విరమణ చేసినప్పుడు లభిస్తాయి. ఉద్యోగి వేరే ఉద్యోగానికి లేదా కంపెనీ మారినప్పుడు పీఎఫ్ ఖాతా తెరుస్తారు. అయితే, ఒకటికి మించి ఖాతాలు ఉండడం వల్ల ఇబ్బందులు తలెత్తుతుండాన్ని గమనించిన ప్రభుత్వం యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యూఏఎన్) ప్రవేశపెట్టింది. ఒక వ్యక్తికి ఒకే ప్రత్యేక సంఖ్య ఉంటుంది. అన్ని పీఎఫ్ ఖాతాలు ఈ నంబర్‌తోనే లింక్ అయి ఉంటాయి. ఉద్యోగాలు మారినా పాత యూఏఎన్ నంబర్‌తోనే కొత్త ఖాతా క్రియేట్ అవుతుంది.
అయితే, ఈయూఏఎన్ నంబర్ కచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి. లేకపోతే తమ పీఎఫ్ ఖాతాల్లో బ్యాలెన్స్ ఎంత ఉంది? కంపెనీలు జమ చేస్తున్నాయా? నెలకు ఎంత జమ అవుతుంది? అనే వివరాలు తెలుసుకోవడం కుదరదు. కొందరు నెలల తరపడి ఒక్కసారి కూడా తమ పీఎఫ్ ఖాతాను తనిఖీ చేయరు. అలాంటి సందర్భంలో యూఏఎన్ నంబర్ మర్చిపోయే అవకాశం ఉంటుంది. మరి ఇలా యూఏఎన్ మర్చిపోతే ఎలా? మళ్లీ యూఏఎన్ నంబర్ తెలుసుకోవచ్చా? అనే ప్రశ్నలు మెదులుతుంటాయి. అయితే, ఆన్‌లైన్ ద్వారా ఈజీగానే మీ యూఏఎన్ నంబర్ తెలుసుకోవచ్చు.
ఆన్‌లైన్ లో యూఏఎన్ నంబర్ తెలుసుకోవచ్చు?
ముందుగా ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్‌షైట్ www.epfindia.gov.inలోకి వెళ్లాలి.
హోమ్ పేజీలోని సర్వీసెస్ ట్యాబ్‌లో For Employees విభాగంలో Member UAN / Online Servicesపై క్లిక్ చేయాలి.
ఇప్పుడు కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. కుడి వైపున ముఖ్యమైన లింక్‌లు కనిపిస్తాయి. అందులో నో యువర్ యూఏఎన్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేసి, క్యాప్చా కోడ్ నమోదు చేసి సబ్మిట్ చేయాలి.
ఆ తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఆ OTPని సూచించిన స్థానంలో నమోదు చేయాలి.
మీ పేరు, పుట్టిన తేదీ, పీఎఫ్ మెంబర్ ఐడీ, ఆధార్ నంబర్ / పాన్ నంబర్‌ను నమోదు చేయాలి.
ఆ తర్వాత షో మై UAN ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
దీంతో మీ UAN నంబర్ సమాచారం మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వస్తుంది.