ఆదాయపు పన్ను చెల్లించే వారు ట్యాక్స్ మినహాయింపుల కోసం ఎక్కువగా ఉపయోగించే విధానాల్లో ఇన్‌కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 లోని సెక్షన్ 80 సీ చాలా పాపులర్. దాదాపు అందరు ఈ సెక్షన్ వినియోగించుకుని పన్ను ఆదా చేసుకుంటారు. అయితే, మీరు ఎంచుకునే పన్ను విధానంపై ఈ సెక్షన్ వర్తిస్తుంది. పాత పన్ను విధానం ఎంచుకున్న వారు మాత్రమే ఈ సెక్షన్ కింద పన్ను మినహాయింపులు క్లెయిమ్ చేసుకోవచ్చు. కొత్త పన్ను విధానంలో ఎలాంటి ట్యాక్స్ బెనిఫిట్స్ ఉండవు. అయితే, పన్ను ఆదాకు సెక్షన్ 80 సీ ఏ విధంగా ఉపయోగపడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
సెక్షన్ 80 సీ అనేది వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు ఒక ఆర్థిక ఏడాదిలో గరిష్ఠంగా రూ. 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపులు పొందేందుకు అవకాశం కల్పిస్తోంది. నికర పన్ను విధించదగిన ఆదాయం, సంబంధిత పన్ను బాధ్యతను సమర్థవంతంగా తగ్గిస్తుంది. ఈ సెక్షన్ ద్వారా ప్రయోజనాలను పూర్తిగా ఉపయోగించుకోవడం ద్వారా రూ. 46 వేల 800 వరకు ఆదా అవుతుంది. సెస్ 4 శాతం ఆదా చేసుకోవచ్చు. ముఖ్యంగా అత్యధిక పన్ను పరిధి 30 శాతం పరిధిలో ఉన్న వారికి ఎక్కువ ప్రయోజనం చేకూరుతుంది.
ఈ బెనిఫిట్ పొందాలంటే ట్యాక్స్ పేయర్స్ అర్హత కలిగిన పెట్టుబడి మార్గాల్లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ట్యాక్స్ మినహాయింపులు క్లెయిమ్ చేసే ఏడాదిలో ఈ పెట్టుబడులు పెట్టి ఉండాలి. రూ. 1.5 లక్షల వరకు పెట్టుబడులపై పన్ను డిడక్షన్స్ లభిస్తాయి. ఇందులో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్, పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్, ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ మ్యూచువల్ ఫండ్స్, సుకన్య సమృద్ధి యోజన స్కీమ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్, ఐదేళ్ల ట్యాక్స్ సేవింగ్స్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు, నేషనల్ పెన్షన్ సిస్టమ్, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్స్ వంటివి ఉన్నాయి. మరోవైపు.. లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం, హోమ్ లోన్ రీపేమెంట్, పిల్లల పాఠశాల ట్యూషన్ ఫీజుల వంటి ఖర్చులపైనా సెక్షన్ 80 సీ ద్వారా మినహాయింపులు క్లెయిమ్ చేసుకోవచ్చు.
సెక్షన్ 80సీ అనేది ట్యాక్స్ చెల్లించాల్సిన ఆదాయాన్ని తగ్గిస్తుంది. దీంతో ట్యాక్స్ లయబిలిటీ తగ్గుతుంది. అయితే, ప్రత్యేక పెట్టుబడి, పేమెంట్స్ కు మాత్రమే ఈ సెక్షన్ వర్తిస్తుంది. పన్ను చెల్లించాల్సిన ఆదాయాన్ని గరిష్ఠంగా రూ. 1.5 లక్షల వరకు తగ్గిస్తుంది. మీరు ట్యాక్స్ బెనిఫిట్ పొందాలనుకుంటే ఆర్థిక ఏడాది ముగిసే లోపు అర్హత పొందిన మార్గాల్లో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.