రోహిత్ శర్మ నుంచి కెప్టెన్సీ అందుకున్న హార్దిక్ పాండ్యా తొలి మ్యాచ్‌లో రాణించలేకపోయాడు. టీమ్ మేనేజ్‌మెంట్ మద్దతు ఉన్నప్పటికీ, అభిమానుల ఒత్తిడితో హార్దిక్ తడబడ్డాడు.
అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై విజయం సాధించలేకపోయింది. బౌలింగ్, బ్యాటింగ్, కెప్టెన్సీలో తనదైన ముద్ర వేయలేకపోయాడు. ఆదివారం రాత్రి గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఆరు పరుగుల తేడాతో ఓడిన సంగతి తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ (45; 39 బంతుల్లో), కెప్టెన్ శుభమన్ గిల్ (31; 22 బంతుల్లో) రాణించారు. బుమ్రా మూడు వికెట్లు తీశాడు.
అనంతరం ఛేదనలో ముంబై ఇండియన్స్ 20 ఓవర్లకు తొమ్మిది వికెట్లు కోల్పోయి 162 పరుగులే చేసింది. బ్రెవిస్ (46; 38 బంతుల్లో), రోహిత్ శర్మ (43; 29 బంతుల్లో) పోరాడారు. అయితే రోహిత్, బ్రెవిస్ దాటికి ఓ దశలో ముంబై 12 ఓవర్లకు 107/2తో మెరుగైన స్థితిలో ఉంది. రోహిత్ ఔటైనప్పటికీ ముంబై విజయ సమీకరణం 8 ఓవర్లలో 48 పరుగులే. కానీ ముంబై జట్టు విజయతీరాలకు చేరలేకపోయింది.