తాను వ్యాపారానికి వ్యతిరేకం కాదు... కానీ గుత్తాధిపత్యానికి మాత్రం వ్యతిరేకమని లోక్ సభలో ప్రతిపక్ష నేత, ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. న్యాయమైన, పారదర్శకత కలిగిన వ్యాపారానికి తాను మద్దతిస్తానన్నారు. వ్యాపార గుత్తాధిపత్యంపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఖండించింది. ఈ నేపథ్యంలో ఆయన స్పందించారు.నేను కచ్చితంగా ఓ విషయం చెప్పాలనుకుంటున్నానని... తన బీజేపీ ప్రత్యర్థులు వ్యాపార వ్యతిరేకిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కాని తాను గుత్తాధిపత్యానికే వ్యతిరేకమని స్పష్టం చేశారు. ఉద్యోగ కల్పన, వ్యాపారానికి, ఆవిష్కరణలకు, పోటీ తత్వానికి తాను మద్దతిస్తానన్నారు. గుత్తాధిపత్యానికి, మార్కెట్ నియంత్రణకు తాను వ్యతిరేకమని తేల్చి చెప్పారు. వేళ్లపై లెక్కించదగిన సంఖ్యలో కొందరు వ్యక్తులే వ్యాపారంలో ఆధిపత్యం చెలాయించడానికి తాను వ్యతిరేకం అన్నారు. తాను మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్‌గా కెరీర్‌ను ప్రారంభించానని... వ్యాపార విజయానికి అవసరమైన అంశాలను అర్థం చేసుకోగలుగుతానన్నారు.