ఏపీ సీఎం చంద్రబాబు నేడు గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్లాయపాలెంలో గ్యాస్ ఇన్సులేటెడ్ విద్యుత్ సబ్ స్టేషన్ ను ప్రారంభించారు. ఇది 400/220 కేవీ సబ్ స్టేషన్. దీన్ని రూ.505 కోట్ల వ్యయంతో నిర్మించారు. నేడు తాళ్లాయపాలెం విచ్చేసిన సీఎం చంద్రబాబు... ఈ సరికొత్త సబ్ స్టేషన్ ను ప్రారంభించారు. ఇక్కడ్నించే మరో ఐదు సబ్ స్టేషన్లను కూడా చంద్రబాబు వర్చువల్ గా ప్రారంభించారు. ఈ ఐదు సబ్ స్టేషన్లను రూ.702 కోట్లతో నిర్మించారు. ఇక, రూ.4,665 కోట్లతో చేపట్టనున్న 14 ట్రాన్స్ కో పనులకు కూడా చంద్రబాబు నేడు వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా పాల్గొన్నారు.