స్వల్ప లక్ష్యం.. సునాయసంగా చేధిస్తామనే అతి విశ్వాసమే తమ ఓటమిని శాసించిందని ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తెలిపాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 6 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.చివరి 5 ఓవర్లలో 42 పరుగులు చేయలేక ఓటమిపాలైంది.ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన హార్దిక్ పాండ్యా.. చేజేతులా గెలిచే మ్యాచ్‌ను కోల్పోయామన్నాడు. 'చివరి 5 ఓవర్లలో 42 పరుగులు చేయలేమా? అనే అతి విశ్వాసమే మా పతనాన్ని శాసించింది. సునాయసంగా చేధిస్తామని భావించాం. గతంలో ఈ తరహా లక్ష్యాలను ఎన్నో చేధించిన అనుభవం నేపథ్యంలో లక్ష్యాన్ని తక్కువ అంచనా వేసాం.ఈ మైదానంలో ఆడటం చాలా సంతోషాన్నిస్తోంది. లక్ష మంది అభిమానుల మధ్య మ్యాచ్ ఆడటం ప్రత్యేక అనుభూతినిస్తోంది. ఇక్కడ విభిన్నమైన వాతావరణం ఉంటుంది. అభిమానులందరికి ఈ మ్యాచ్‌తో అసలు సిసలు మజా లభించింది. రషీద్ ఖాన్ బౌలింగ్‌లో తిలక్ వర్మ సింగిల్ తీయకపోవడం అతని బ్యాటింగ్ ప్రణాళికలో భాగం కావచ్చు.
ఆ సమయంలో అతను మంచి బ్యాటింగ్ ప్రణాళిక ఉన్నట్లుంది. అందుకే సింగిల్స్‌కు నిరాకరించాడు. ఈ విషయంలో అతనికి నేను పూర్తి మద్దతు ఇస్తున్నాను. సింగిల్ తీయకపోవడం పెద్ద సమస్య కాదు. ఇంకా మాకు 13 మ్యాచ్‌లు ఉన్నాయి.'అని హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు. రషీద్ ఖాన్ వేసిన 17వ ఓవర్‌లో తిలక్ వర్మ సింగిల్స్ తీయకుండా బాల్స్ డాట్ చేశాడు. దాంతో ఈ ఓవర్‌లో 3 పరుగులే వచ్చాయి.చివరి ఐదు ఓవర్లలో ముంబై వరుసగా (4 పరుగులు వికెట్, 3 రన్స్, 9 రన్స్ వికెట్, 8 పరుగులు 2 వికెట్లు, 12 పరుగులు 2 వికెట్లు ) 36 పరుగులే చేసి 6 వికెట్లు కోల్పోయింది.ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 168 పరుగులు చేసింది. అనంతరం ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 162 పరుగులు చేసి ఓటమిపాలైంది. రోహిత్ శర్మ(29 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 43), డెవాల్డ్ బ్రెవాస్(38 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 46) టాప్ స్కోరర్లుగా నిలిచారు.