గత ఆర్థిక సంవత్సరం 2023-24 (అసెస్మెంట్ ఇయర్ 2024-25)కి సంబంధించి ఆన్‌లైన్ ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ (ఐటీఆర్) ఫైలింగ్ ప్రాసెస్ అనేది ఇ-ఫైలింగ్ ట్యాక్స్ పోర్టల్‌లో అందుబాటులో ఉంది. ఏప్రిల్ 1, 2024 తేదీనే ట్యాక్స్ పేయర్లకు అవసరమైన ఐటీఆర్ ఫామ్స్‌ని విడుదల చేసింది కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు. త్వరగా ఐటీఆర్ ఫైల్ చేయడం ద్వారా సులభంగా ఫైల్ చేసే విలుకలగడంతో పాటు ప్రాసెసింగ్ సైతం వేగంగా అవుతందని వెల్లడించింది. అయితే, ఏప్రిల్ 1వ తేదీనే ఐటీఆర్ ఫామ్స్ అందుబాటులోకి వచ్చినా ఉద్యోగులు మాత్రమే జూన్ 15 తేదీ వరకు తమ రిటర్నులు దాఖలు చేయకుండా వేచి చూడాలని పన్ను నిపుణులు సూచిస్తున్నారు. అందుకు గల కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
సాధారణంగా ఉద్యోగులకు సంబంధించిన వార్షిక సమాచార స్టేట్మెంట్ (AIS), ఫామ్ 26AS అనేది పూర్తి స్థాయిలో మే 31వ తేదీ తర్వాతే అప్డేట్ అవుతుంది. అలాగే ఈ తేదీ తర్వాత 15 రోజుల్లోగా ఉద్యోగులకు టీడీఎస్ సర్టిఫికేట్ లభిస్తుంది. అలాగే గత ఆర్థిక ఏడాదికి సంబంధించిన చివరి త్రైమాసికం సమాచారం మే 31 తర్వాతే అప్డేట్ అవుతుంది. అందుకే జూన్ 15వ తేదీ వరకు ఉద్యోగులు వేచి చూడాలి. అలా కాకుండా తొందరపడి అరకొర సమాచారంతో ఐటీ రిటర్నులు దాఖలు చేస్తే పెనాల్టీలు కట్టాల్సి వస్తుంది. ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్నులు దాఖలు చేసేందుకు జులై 31, 2024 వరకు అవకాశం ఉంటుంది.
జూన్ 15 తర్వాతే ఫామ్ 16, ఫామ్ 16A..
ఆదాయపు పన్ను చట్టాల ప్రకారం ఒకసారి టీడీఎస్ లేదా టీసీఎస్ రిటర్ను దాఖలు చేస్తే డిడక్టర్ టీడీఎస్, టీసీఎస్ సర్టిఫికెట్ జారీ చేయాల్సి ఉంటుంది. టీడీఎస్ సర్టిఫికెట్ అనేది 15 రోజుల్లోగా ఇవ్వాలి. అందుకే ఉద్యోగి పని చేసే కంపెనీ యాజమాన్యం చివరి నెల ఫామ్ 16 సర్టిఫికేట్ జూన్ 15లోపు జారీ చేయాల్సి ఉంటుంది. అలాగే బ్యాంకులు, మ్యూచూవల్ ఫండ్స్, ఇతర కంపెనీలు గత ఆర్థిక ఏడాది 2023-24లో పన్నులు డిడక్ట్ చేసినట్లయితే వారు సైతం ఫామ్ 16A (టీడీఎస్ సర్టిఫికేట్) జారీ చేయాల్సి ఉంటుంది. అయితే, కొన్ని సందర్భాల్లో జూన్ 15 తర్వాత సైతం ఈ టీడీఎస్ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు.
పన్ను చెల్లింపుదారులు తప్పనిసరిగా ఫామ్ 16 లేదా ఫామ్ 16A లోని సమాచారం AIS, ఫామ్ 26ASలతో సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ వాటిల్లోని సమాచారం సరిపోలకుంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఎలాంటి సమాచారం తనిఖీ చేసుకోకుండా ఐటీఆర్ ఫైల్ చేసి తప్పుడు సమాచారం ఇచ్చినట్లు తేలితే అసెస్మింగ్ ఆఫీర్ నోటీసులు ఇస్తారు. అండర్ రిపోర్టింగ్ ఇన్‌కమ్ ఐటీఆర్‌గా తేలుస్తారు. ఇందుకు మీరు 50 శాతం నుంచి 200 శాతం వరకు పెనాల్టీలు కట్టాల్సి వస్తుంది. సెక్షన్ 270ఏ ప్రకారం ఈ పెనాల్టీలు పడతాయి.