భారత్ చరిత్రలో ఫైనల్ చేరిన తొలి భారత మహిళా రెజ్లర్‌గా వినేశ్ ఫొగాట్ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. పారిస్ ఒలింపిక్స్ 2024లో మహిళల 50 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో మంగళవారం జరిగిన సెమీస్‌లో 5-0 తేడాతో క్యూబా రెజ్లర్ గుజ్మన్ లోపేజ్‌ను వినేశ్ చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో పూర్తి ఆధిపత్యం చెలాయించిన వినేష్ ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు. ఈ గెలుపుతో వినేష్ కనీసం రజత పతకం ఖాయం చేసుకుంది.
మహిళల 50 కేజీల ఫ్రీస్టైల్ విభాగం ఫైనల్లో టోక్యో కాంస్య విజేత, అమెరికా స్టార్ రెజ్లర్ సారా హిల్డర్‌బ్రాంట్‌తో వినేశ్ ఫొగాట్ తలపడుతుంది. ఈ మ్యాచ్ బుధవారం రాత్రి 11.23 గంటలకు జరగనుంది. స్వర్ణ పతకమే లక్ష్యంగా వినేశ్ బరిలోకి దిగుతోంది. గోల్డ్ మెడల్ తీసుకువస్తా అని వినేశ్ తన తల్లికి మాట ఇచ్చింది. సెమీస్ విజయం తర్వాత వినేష్ వీడియో కాల్‌లో తన తల్లితో మాట్లాడారు. ఈ సమయంలో వినేష్ తన కుటుంబ సభ్యులకు ఫ్లయింగ్ కిస్‌లు ఇచ్చి.. భావోద్వేగానికి గురైంది. వీడియో చివర్లో 'గోల్డ్ లానా హై' (నేను బంగారం తెస్తా) అని తన తల్లితో అన్నారు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.