ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డుపు మాడ్చుకొని..!,,చందాలతో ఒలింపిక్స్‌కు వెళ్లి గోల్డ్ పట్టుకొచ్చాడు

sports |  Suryaa Desk  | Published : Fri, Aug 09, 2024, 10:42 PM

జులై 26న పారిస్ ఒలింపిక్స్ ప్రారంభమయ్యాయి. భారత్ నుంచి మొత్తం ఈసారి 117 మంది అథ్లెట్లు ఒలింపిక్స్‌లో తమ అదృష్టం పరీక్షించుకునేందుకు వచ్చారు. ఇంతమంది ఉన్నా అందరి కళ్లూ గోల్డెన్ బాయ్, టోక్యో ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రోలో గోల్డ్ సాధించిన నీరజ్ చోప్రాపైనే ఉన్నాయి. ఇతడి ఆట కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూశారు. కోట్లాది భారతీయుల అంచనాల్ని మోస్తూ బరిలోకి దిగినా.. తన గోల్డ్‌ను కాపాడుకోలేకపోయాడు. రెండో స్థానానికి పరిమితమై సిల్వర్ సొంతం చేసుకున్నాడు. అయితే దాయాది దేశం పాకిస్థాన్‌కు చెందిన బల్లెం వీరుడు అర్షద్ నదీమ్.. స్వర్ణం సొంతం చేసుకున్నాడు. మామూలుగా కాదు.. ఏకంగా ఒలింపిక్ రికార్డు సాధిస్తూ ఈటెను అందరికంటే దూరం విసిరి అగ్రభాగాన నిలిచాడు. రాత్రికి రాత్రే నదీమ్ స్టార్‌గా మారిపోయాడు. ఈ క్రమంలోనే అసలు నదీమ్ ఎవరు.. అతడి నేపథ్యం ఏంటి అని అందరూ తెలుసుకునే ప్రయత్నం చేయగా.. జీవిత కథ విని కన్నీళ్లు పెట్టుకునేట్లుగా ఉంది. ఏడాదికి ఒకసారి మాత్రమే ఇంట్లో మాంసం తినే పరిస్థితి. ఊరందరు కలిసి చందాలేసుకొని శిక్షణ ఇప్పించి ఒలింపిక్స్‌కు పంపారట.


 అసలు నదీమ్ ఈసారి ఒలింపిక్స్‌లో పాల్గొనడం కష్టమే అన్నట్లుగా ఉండేది కొద్దిరోజుల ముందువరకు పరిస్థితి. వరుస గాయాలు తీవ్ర ఇబ్బంది పెట్టాయి. ఎన్నో కష్టనష్టాలను ఓర్చుకొని గెలిచి నిలిచాడు. నదీమ్ తండ్రి ఒక రోజువారీ కూలీ. వీరిది నిరుపేద కుటుంబం. వారి ఊళ్లో అంతా చందాలు వేసుకొని.. నదీమ్‌కు శిక్షణ ఇప్పించారు. ఎన్నో సార్లు కడుపు మాడ్చుకున్న పరిస్థితి. పర్వదినమైన ఈద్ అల్ అదా రోజు మాత్రమే ఏడాదిలో ఒక్కసారే ఇంట్లో మాంసం వండేవారంట. ఆటకు అవసరమయ్యే కొత్త పరికరాలు కొనుగోలు చేసేంత స్థోమత కూడా లేకపోగా.. పాత వాటినే జాగ్రత్తగా వాడుకున్నాడు. ఒలింపిక్స్‌కు వెళ్లేందుకు కూడా సరైన వనరులు లేక.. ఈ సంవత్సరం మార్చి వరకు వాటిని సమకూర్చుకునేందుకే ప్రయత్నించాడు. ఎలాగోలా ఒలింపిక్స్‌కు అడుగుపెట్టి.. పాకిస్థాన్‌కు 40 ఏళ్ల ఒలింపిక్స్ గోల్డ్ కల నెరవేర్చాడు.


>> 1997 జనవరి 2న మియా చాను దగ్గర్లోని ఖనేవాల్ అనే ఊళ్లో జన్మించాడు అర్షద్. తండ్రి మహ్మద్ అష్రాఫ్ తాపీ పని కూలీ. కుటుంబంలోని మొత్తం ఏడుగురు సంతానంలో నదీమ్ మూడోవాడు. చిన్నప్పటినుంచే క్రికెట్, అథ్లెటిక్స్, ఫుట్‌బాల్, బ్యాడ్మింటన్ ఇలా అన్నింట్లోనూ నదీమ్ ముందుండేవాడు. అసలు క్రికెటర్ అవుదామనుకున్నాడట నదీమ్. మంచి బౌలర్. జిల్లా స్థాయి టోర్నమెంట్లు కూడా ఆడాడు. అయితే నదీమ్.. అథ్లెటిక్స్‌లో మంచి ప్రదర్శన చేస్తున్నట్లు అతడి కోచ్ రషీద్ అహ్మద్ గుర్తించి.. తాను పాఠాలు నేర్పించడం మొదలుపెట్టాడు.


నదీమ్ ముందుగా షాట్‌పుట్, డిస్కస్ త్రో వంటివి ప్రయత్నించాడు. తర్వాత జావెలిన్ త్రోలో జూనియర్ స్థాయి టోర్నమెంట్లలో రాణించడంతో.. జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఈ క్రమంలోనే అతడికి సైన్యం నుంచి ఆఫర్లు రాగా తిరస్కరించాడు. జావెలిన్ త్రోను లక్ష్యంగా చేసుకోవడంలో అతడికి తన తండ్రి నుంచి కూడా మద్దతు లభించింది.


ఇలా 2015లో జావెలిన్ త్రోలో నదీమ్ కెరీర్ మొదలైంది. వరల్డ్ అథ్లెటిక్స్ స్కాలర్‌షిప్ సాయంతో.. మారిషస్‌లో హైపెర్ఫార్మింగ్ ట్రైనింగ్ తీసుకున్నాడు. అక్కడ సాఫీగా ఏం సాగలేదు. ఎన్నో గాయాలు ఇబ్బంది పెట్టాయి. సొంత దేశం పాక్ నుంచి కూడా స్కాలర్ షిప్ రావడం కష్టమైంది. నదీమ్ ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటే.. గ్రామంలోని వారంతా కలిసి చందాలేసే పరిస్థితి. ఇలా ఎన్నో కష్టాలు అంతరాయం కలిగించినా.. తన లక్ష్యాన్ని వీడలేదు.


2016లో తొలిసారిగా నదీమ్- నీరజ్ చోప్రా సౌత్ ఏషియన్ గేమ్స్‌లో ఎదురుపడ్డారు. గువాహటిలో ఈ పోటీలు జరగ్గా.. నీరజ్ స్వర్ణం గెల్చుకున్నాడు. నదీమ్‌ను కాంస్యం వరించింది. 2021 టోక్యో ఒలింపిక్స్‌లో నీరజ్ గోల్డ్ సాధించగా.. నదీమ్ ఐదో స్థానంలో నిలిచాడు. 2022లో నదీమ్ తొలిసారి 90 మీటర్ల మార్క్ దాటి కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం సాధించాడు. దీంతో ఒలింపిక్స్‌లో పతకం సాధిస్తాడని ఆశలు పెరిగాయి.


అయితే పారిస్ ఒలింపిక్స్ పోటీలు దగ్గరపడుతున్న కొద్దీ నదీమ్ కష్టాలు కూడా ఎక్కువయ్యాయి. గతేడాది ఆసియా క్రీడలకు దూరమయ్యాడు. ఈ ఫిబ్రవరిలోనే ఒలింపిక్స్ కోసం శిక్షణ మొదలుపెట్టాడు. మళ్లీ గాయపడటంతో మోకాలి శస్త్రచికిత్స చేయించుకొని 2 నెలలు రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. మెల్లగా కోలుకొని పారిస్‌కు చేరుకున్నాడు. పాక్ నుంచి కేవలం ఏడుగురు అథ్లెట్లే వచ్చారంటే ఆ దేశంలో పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. వీరందరిలో నదీమ్ ఒక్కడినే మెడల్ (గోల్డ్) వరించింది. దీంతో సింధ్ ప్రావిన్స్ ఏకంగా రూ. 5 కోట్ల నజరానా ప్రకటించింది.


పారిస్ ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రో ఫైనల్లో నదీమ్ తన రెండో ప్రయత్నంలో 92.97 మీటర్ల దూరం బల్లెం విసిరాడు. ఏ ఒలింపిక్స్‌లోనైనా ఇదే రికార్డు. తన కెరీర్లో ఇప్పటివరకు 90 మీటర్ల మార్క్ దాటని నీరజ్ చోప్రా.. రెండో ప్రయత్నంలో 89.45 మీటర్ల దూరం విసిరాడు. దీంతో రెండో స్థానానికి చేరాడు. ఇక ఎవరూ వీరిని దాటలేదు. దీంతో వరుసగా గోల్డ్, సిల్వర్ సాధించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com