ప్రస్తుతం పురుషుల్లో సంతానలేమి సమస్యలు పెరుగుతున్నాయి. మారిన జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పులు, శారీరక శ్రమ పూర్తిగా తగ్గడం వల్ల చాలా మంది పురుషుల్లో సంతానలేమి సమస్యగా సర్వసాధారణంగా మారిపోయింది.శుక్రకణాల నాణ్యత దెబ్బతినడమే ఇందుకు ప్రధాన కారణంగా నిపుణులు చెబుతుంటారు. ఇక శుక్ర కణాల నాణ్యత దెబ్బతినేందుకు వేడి ఎక్కువగా ఉండే ప్రదేశంలో ఉండడం, సరైన జీవన విధానాన్ని పాటించకపోవడం వంటివి కారణాలు. అయితే ఒత్తిడి కూడా శుక్ర కణాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని చాలా మంది అనుకుంటుంటారు.
కానీ తాజాగా నిర్వహించిన పరిశోధనలో ఇందులో నిజం లేదని తేలింది. శుక్ర కణాలపై ఒత్తిడి ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపదని నిపుణులు అంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఒత్తిడి మంచిదని అంటున్నారు. ఒత్తిడి శుక్రకణాల చలనశీలతను పెంచుతుందని అంటున్నారు. ఒత్తిడి పురుషుల్లో సంతానోత్పత్తిని కూడా ప్రభావితం చేస్తుందని పరిశోధనల్లో వెల్లడైంది. దీర్ఘకాలిక ఒత్తిడి కూడా పునరుత్పత్తిపై ప్రభావం చూపుతుందని అంటున్నారు. కొలరాడో అన్‌స్చుట్జ్ మెడికల్ క్యాంపస్ విశ్వవిద్యాలయం చెందిన పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
ఒత్తిడి పునరుత్పత్తిని ఎలా ప్రభావితం చేస్తుంది, పిండం అభివృద్ధిని మెరుగుపరచడంలో సహాయపడుతుందన్న అంశాలపై చేసిన పరిశోధనల్లో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. అయితే గడిచిన 50 ఏళ్లలో శుక్రకణాల నాణ్యత తగ్గుతోందని పరిశోధనల్లో వెల్లడైంది. దీనికి ప్రధాన కారణం పర్యావరణంలో వస్తున్న మార్పులు, కాలుష్యమని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ మార్పులు స్పెర్మ్‌ను ఎలా ప్రభావితం చేస్తాయన్న దానిపై పరిశోధకులకు ఇంకా పూర్తిగా స్పష్టత రాలేదు.
ఇక ఒత్తిడి తర్వాత స్పెర్మ్ చలనశీలత గణనీయంగా మెరుగుపడుతుందని పరిశోధనల్లో తేలింది. కోవిడ్ మహమ్మారి సమయంలో ఒత్తిడితో కూడిన జీవనశైలి అనంతరం జనన రేటును పెంచడంలో ఇది సహాయపడి ఉండొచ్చని అంటున్నారు. ఒత్తిడి-ప్రేరిత అనుసరణలు స్పెర్మ్ శక్తి ఉత్పత్తిని, చలనశీలతను మెరుగుపరచడంలో సహాయపడతాయని పరిశోధకులు చెబుతున్నారు. మొత్తం మీద ఒత్తిడి శుక్రకణాలపై సానుకూల ప్రభావాన్నే చూపుతాయని అంటున్నారు.