బ్యాంకులో డబ్బులు దాచుకోవాలని చూసే వారు ప్రధానంగా వడ్డీ రేట్లు చూస్తుంటారు. అధిక వడ్డీ ఇస్తూ తక్కువ సమయంలోనే చేతికి డబ్బులు అందించే పథకాలకు ప్రాధాన్యత ఇస్తారు. మీరు కూడా ఇలా ఎక్కువ వడ్డీ ఇస్తూ తక్కువ సమయంలోనే హైరిటర్న్స్ అందించే ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాల కోసం చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే. ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకుల్లో ఒకటైన ఇండియన్ బ్యాంక్ రెండు స్పెషల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాలు అందిస్తోంది. అవే ఇండ్ సూపర్ 300 డేస్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్, ఇండ్ సూపర్ 400 డేస్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్. ఈ రెండు పథకాల్లో ఇన్వెస్ట్ చేసేందుకు ఇంకా ఒక్కరోజు మాత్రమే సమయం ఉంది. ఎందుకంటే సెప్టెంబర్ 30, 2024 తర్వాత ఈ రెండు పథకాల అందుబాటులో ఉండకపోవచ్చు. వాటి గడువు ముగుస్తోంది. మరి ఇందులో రూ.5 లక్షలు జమ చేస్తే ఎవరికి ఎంతొస్తుంది? అనేది తెలుసుకుందాం.
ఇండియన్ బ్యాంకు ఇండ్ సూపర్ 300 డేస్ స్కీమ్ ద్వారా జనరల్ పబ్లిక్‌కు గరిష్ఠంగా 7.05 శాతం వడ్డీ రేట్లు ఇస్తోంది. అదే సీనియర్ సిటిజన్లు అయితే 7.55 శాతం, 80 ఏళ్లు వయసు పైబడిన సూపర్ సీనియర్ సిటిజన్లకు అయితే 7.80 శాతం వడ్డీ అందిస్తోంది. ఇక ఇండ్ సూపర్ 400 డేస్ ఎఫ్‌డీ స్కీమ్ ద్వారా సాధారణ కస్టమర్లకు 7.25 శాతం వడ్డీ ఇస్తుండగా.. సీనియర్ సిటిజన్లకు 7.75 శాతం, సూపర్ సీనియర్ సిటిజన్లకు 8 శాతం మేర వడ్డీ అందిస్తోంది.
రూ.5 లక్షలు జమ చేస్తే ఎంతొస్తుంది?
ఇండ్ సూపర్ 300 డేస్ ఎఫ్‌డీ స్కీమ్‌లో ఒక సాధారణ కస్టమర్ రూ.5 లక్షల జమ చేశాడు అనుకుందాం. అతడికి 7.05 శాతం వడ్డీ వర్తిస్తుంది. దీని ప్రకారం మెచ్యూరిటీ తర్వాత చేతికి రూ. 5,29,700 వరకు లభిస్తాయి. అదే సీనియర్ సిటిజన్ అయితే 7.55 శాతం వడ్డీ రేటుతో చేతికి రూ. 5,31,800 వరకు అందుతాయి. ఇక సూపర్ సీనియర్ సిటిజన్ అయితే 7.80 శాతం వడ్డీ రేటుతో మెచ్యూరిటీ తర్వాత చేతికి రూ. 5,32,850 వరకు లభిస్తాయి.
ఇక ఇండ్ సూపర్ 400 డేస్ స్కీమ్ తీసుకుంటే ఒక జనరల్ కస్టమర్ ఇందులో రూ.5 లక్షలు డిపాజిట్ చేశాడు అనుకుందాం. సదరు వ్యక్తికి 7.25 శాతం వడ్డీ లభిస్తుంది. దీని ప్రకారం మెచ్యూరిటీ తర్వాత అసలు, వడ్డీ కలిపి చేతికి రూ. 5,39,700 వరకు అందుతాయి. ఇక ఒక సీనియర్ సిటిజన్ అయితే 7.80 శాతం వడ్డీ వర్తిస్తుంది. దీని ప్రకారం చేతికి రూ. 5,42,700 వరకు లభిస్తాయి. ఇక సూపర్ సీనియర్ సిటిజన్ అయితే 8 శాతం వడ్డీ రేటుతో చేతికి రూ. 5,43,800 వరకు అందుతాయి.