ఆంధ్రప్రదేశ్ రాజధాని ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించిన ప్రక్రియ వేగవంతం అవుతోంది. ఓఆర్ఆర్ ఎలైన్మెంట్ ఖరారు, డీపీఆర్ పనులు ప్రారంభించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రిక్వెస్ట్‌తో.. ఈ ఓఆర్ఆర్ భూసేకరణ సహా ఖర్చు మొత్తం భరించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఎన్హెచ్ఏఐ అధికారులకు ఓ ఆర్ఆర్ తుది ఎలైన్మెంట్ ఖరారు చేయాలని, డీపీఆర్ సిద్ధం చేయాలని ఆదేశాలొచ్చాయి. ఇటీవల ఆర్వీ అసోసియేట్స్ (సలహా సంస్థ)తో కలిసి పనులు ప్రారంభం అయ్యాయి. ఈ మేరకు సర్వేలు పూర్తిచేసి ఏడాదిలో డీపీఆర్ రూపకల్పన పూర్తిచేయాలని టార్గెట్‌గా పనిచేస్తున్నారు.
2018లో మొత్తం 189 కి.మీ. ఉన్న ఓఆర్ఆర్ ఎలైన్‌మెంట్‌ను రూపొందించిన సంగతి తెలిసిందే. కానీ ఈ ఎలైన్మెంట్ రూపొందించి ఆరేళ్లు కావడంతో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎలైన్‌మెంట్‌ను మరోసారి పరిశీలించేందుకు డ్రోన్ వీడియోలు తీసి.. పాత ఎలైన్‌మెంట్‌లో కొత్తగా ఏవైనా నిర్మాణాలు వచ్చాయా? రోడ్లు వేశారా? ఓఆర్ఆర్ మీదుగా హైటెన్షన్ విద్యుత్ లైన్లు ఎన్ని ఉన్నాయనే అంశాలను పరిశీలిస్తున్నారు. ఈ ప్రక్రియ మొత్తం పూర్తయ్యాక.. ఎన్హెచ్ఏఐ అధికారులు రాష్ట్ర ప్రభుత్వంతో చర్చిస్తారు. ఆతర్వాత తుది ఎలైన్‌మెంట్‌ను కేంద్రానికి పంపించి ఆమోదం తీసుకోనున్నారు.
అంతేకాదు అమరావతి ఓఆర్ఆర్ నిర్మాణం పూర్తయితే.. దాని మీదుా ఎన్ని వాహనాలు తిరుగుతాయనే అంచనాకు సర్వేలు చేస్తున్నారు. వివిధ జాయతీ రహదారులు, ఓఆర్ఆర్ పరిధిలో ఉన్న రాష్ట్ర రోడ్లలో.. ప్రస్తుతం ఉన్న ట్రాఫిక్ ఎంత? వాటిలో ఎన్ని వాహనాలు ఓఆర్ఆర్ మీదుగా వెళ్తాయనేది ట్రాఫిక్ కౌంట్ సర్వే కూడా జరుగుతోంది. హైదరాబాద్, చెన్నై, కోల్‌కతా, అనంతపురం, మచిలీపట్నంతో పాటూ పలు మార్గాల వైపు వచ్చే వాహనాలు.. ఓఆర్ఆర్లో ఎక్కడ ఎంటరవ్వాలని, ఎంత దూరం వెళ్లి.. ఇతర మార్గాల్లోకి మళ్లే అవకాశాలు ఉన్నాయనే అంశాలపై ఆరిజన్ అండ్ డెస్టినేషన్ సర్వే చేస్తున్నారు అధికారులు. ఓఆర్ఆర్పై ఎన్ని యాక్సిల్స్, ఎంత లోడుతో వాహనాలు వెళ్తున్నాయి, వాటిలో ఓఆర్ఆర్ మీదుగా వెళ్లేవి ఎన్ననేదానిపై యాక్సిల్ లోడ్ సర్వే నిర్వహిస్తున్నారు.
అమరావతి ఓఆర్ఆర్ ఎలైన్మెంట్ ఖరారు చేసిన తర్వాత.. ఓ వైపు డీపీఆర్ సిద్ధమవుతూనే మరోవైపు భూసేకరణ, అన్ని అనుమతులు తీసుకోవాలని భావిస్తున్నారు. ఓఆర్ఆర్పై రహదారులు దాటేచోట చేపట్టాల్సిన నిర్మాణాలు, కృష్ణానదిపై చేపట్టబోయే రెండు భారీ వంతెనలు, రైల్వేక్రాసింగ్స్ దగ్గర వంతెనలు, 2 సొరంగాలు, కాల్వలు, తదితర వివరాలన్నీ డీపీఆర్‌లో సిద్ధం చేసే పనిలో ఉన్నారు.
అమరావతి ఓఆర్ఆర్ మొత్తం 189 కి.మీ కాగా.. 5 జిల్లాల పరిధిలో దాదాపు 3వేల హెక్టార్ల భూసేకరణ చేయాలని అంచనాలు ఉన్నాయి. ఏడాదిలో డీపీఆర్ సిద్ధమయ్యే నాటికి 90% భూసేకరణ పూర్తి చేస్తే.. ఆ వెంటనే టెండర్లు పిలిచి, పనులు ప్రారంభించేందుకు అవకాశం ఉంటుందని చెబుతున్నాయి ఎన్హెచ్ఏఐ వర్గాలు. ఈ ఓఆర్ఆర్ కొంత అటవీ ప్రాంతం నుంచి వెళ్తుంది.. ఇది పూర్తిగా గ్రీన్‌ఫీల్డ్ హైవే కావడంతో అటవీశాఖ అనుమతులు, పర్యావరణ అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందంటున్నారు. డీపీఆర్ పూర్తయ్యేలోపే ఈ అనుమతులు పొందడంపై ఫోకస్ పెట్టారు. మొత్తం మీద అమరావతి ఓఆర్ఆర్ను వీలైనంత త్వరగా ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది.