సీఎం చంద్రబాబు నిర్వాకం వల్ల మరోసారి పోలవరం ప్రాజెక్టు వివాదంలో చిక్కుకుందని మాజీ మంత్రి బుగ్గన రాజేంధ్రనాథ్‌రెడ్డి మండి పడ్డారు. చంద్రబాబు వైఖరి వల్ల పోలవరం ఎత్తు తగ్గించారని, దీని వల్ల మొత్తం ప్రాజెక్టు లక్ష్యాలకే గండి పడిందని, ఫలితంగా రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతుందని ఆయన ఆక్షేపించారు.
రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును రెండు దశల్లో 45.57 మీటర్ల ఎత్తులో నిర్మించేందుకు నాడు సీఎం వైయస్ జగన్, పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్ బోర్డు (పీఐబీ) అనుమతి కూడా సాధించారని గుర్తు చేసిన ఆయన, ఇప్పుడు చంద్రబాబు కేంద్రంతో రాజీ పడి ప్రాజెక్టు ఎత్తును 41.15 తగ్గించారని దుయ్యబట్టారు. హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. పోలవరం ఎత్తును 41.15 మీటర్లకు తగ్గిస్తూ, సవరించిన అంచనాల ప్రకారం ప్రాజెక్టు వ్యయాన్ని రూ.30,436 కోట్లుగా తేల్చి, కేంద్ర జలశక్తి శాఖ, రాష్ట్ర నీటిపారుదల శాఖకు గత సెప్టెంబరు 6న లేఖ రాసిందని, ఆ మేరకు ప్రాజెక్టు వ్యయంలో భరించాల్సి ఉన్న బ్యాలెన్స్ రూ.12,155 కోట్లు ఇచ్చేందుకు కూడా అంగీకరించారని మాజీ మంత్రి తెలిపారు.