కాకినాడ జిల్లా గొల్లప్రోలులో సోమవారం నాడు పలు అభివృద్ధి పనులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన శాంతిభద్రతలపై వ్యాఖ్యలు చేశారు. పిల్లలపై లైంగికదాడులు జరగడంపై ఉప ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలపై సీఎం చంద్రబాబు, తాను ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆయన చెప్పారు.
అయినప్పటికీ కొందరు పోలీసులు అలసత్వం వీడటం లేదని మండిపడ్డారు. నిజాయితీగా పనిచేయాలని చెబితే మీనమేషాలు లెక్కిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడేళ్ల చిన్నారిని రేప్ చేసి చంపేస్తే కులం గురించి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. కొందరు ఐపీఎస్ అధికారులు క్రిమినల్స్‌ను వెనకేసుకు వచ్చేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తాను హోంశాఖను తీసుకుంటే పరిస్థితి మరోలా ఉంటుందని హెచ్చరించారు. ధైర్యం లేనివారు పోలీసులుగా ఉండటం ఎందుకని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపాయి.