కెనడా ప్రభుత్వంపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కెనడాలో ఓ హిందూ దేవాలయంపై ఖలిస్థానీ మద్దతుదారులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడి నేపథ్యంలో జైశంకర్ తీవ్రంగా స్పందించారు.కెనడాపై తాను మూడు విషయాలు చెప్పాలనుకుంటున్నానని... ఒకటి నిరాధార ఆరోపణలు చేస్తోందని, రెండోది భారత దౌత్యవేత్తలపై నిఘా పెట్టిందని, ఇది సరైనది కాదని కేంద్రమంత్రి అన్నారు. మూడోది మనమంతా చూస్తున్నామని, అందుకు ఈ వీడియోనే సాక్ష్యం అని ఆలయంపై దాడి ఘటనను ఉద్దేశించి అన్నారు. వీటన్నింటిని పరిగణలోకి తీసుకుంటే అతివాద శక్తులకు రాజకీయాల్లో చోటు కల్పిస్తున్నారనే విషయం తెలిసిపోతోందని విమర్శించారు.అమెరికా ఎన్నికల్లో ఎవరు గెలిచినా ఆ దేశంతో భారత్‍కు సత్సంబంధాలు కొనసాగుతాయన్నారు. డొనాల్డ్ ట్రంప్‌తో సహా గత ఐదు ప్రభుత్వాల హయాంలో ఆ దేశంతో భారత్ మంచి సంబంధాలను కొనసాగించిందని వెల్లడించారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా ఇరుదేశాల మధ్య స్నేహం పురోగతి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.