నెల్లూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో డిస్ట్రిక్ రివ్యూ కమిటీ సమావేశంలో రైతుల కష్టాలపై ఎమ్మెల్యే కావ్యా కృష్ణారెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కావలి నియోజకవర్గ పరిధిలో చాలా కాలువలు పూడిపోయి ఉన్నాయని తెలిపారు. మైనర్ ఇరిగేషన్ అధికారులు పనుల్లో ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రశ్నించారు. చెరువులకు సంబందించి కలుజులు దెబ్బతిని ఉన్నాయని ఎమ్మెల్యే కావ్యా కృష్ణారెడ్డి చెప్పారు. ఇరిగేషన్ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పారు. చెరువులు, కాలువల మీద ప్రతి ఏడాది ఆరు నెలలపాటు లస్కర్లు పనిచేస్తుంటారని అన్నారు. వారికి OM&R ఫండ్స్ ద్వారా జీతాలు చెల్లించే ఆనవాయితీ ఉందని అన్నారు. వెంటనే వారికి జీతాలు చెల్లించకుంటే, సక్రమంగా పంటలకు నీరందే పరిస్థితి ఉండదని చెప్పారు.
కావలి నియోజకవర్గంలో 73 మైనర్, పంచాయతీ రాజ్ చెరువులు ఉన్నాయని ఎమ్మెల్యే కావ్యా కృష్ణారెడ్డి అన్నారు. ఇటీవల భారీ వర్షాల వల్ల చాలా చెరువులకు గండ్లు పడే పరిస్థితి వచ్చిందని అన్నారు. వెంటనే మరమ్మత్తులు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. మేజర్ ఇరిగిషేన్ విభాగం పనిచేసినంతగా, మీడియమ్, మైనర్ ఇరిగేషన్ విభాగాలు పనిచేయడం లేదని చెప్పారు. రైతులకు నీళ్లించేందుకు చెరువుల కలుజులు సరిగాలేవన్నారు. ఇంజన్లతో తోడాల్సిన పరిస్థితి ఉందని చెప్పారు. FDR, NRGS, OM&R నిధుల నుంచి అయినా నిధులు ఇవ్వాలని కోరారు. కావలి చెరువు కిందే 25లక్షల ఎకరాల్లో వరి సాగవ్వాల్సి ఉందని ఎమ్మెల్యే కావ్యా కృష్ణారెడ్డి తెలిపారు.