షెడ్యూల్డ్ ప్రాంత స్థానిక ఉద్యోగ నియామకాల్లో శతశాతం రిజర్వేషన్లు కల్పించే జీవో నెం.3ని పునరుద్ధరించాలని, గిరిజన యువత కోసం ప్రత్యేక డిఎస్సీని ప్రకటించాలని గిరిజనులు డిమాండ్ చేశారు. సోమవారం ఆదివాసీ జేఏ సీ ఆధ్వర్యంలో సీతంపేట నుంచి ఐటీడీఏ కార్యాలయం వరకు మన్యం ర్యాలీ చేపట్టారు. దీనికి ముందు బస్‌స్టాండ్ ఆవరణలో మానవ హారంగా ఏర్పడి నినాదాలు చేశారు. అనంతరం ఐటీడీఏ కార్యాలయ ముఖద్వారం వద్ద నిరసన తెలిపారు.
జేఏసీ నాయకులు బిడ్డిక శ్రీనివాసరావు, రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ ధర్మారావు మా ట్లాడుతూ ఐటీడీఏలో ఖాళీగా ఉన్న పోస్టులను స్థానిక గిరిజన అభ్యర్థుల తో భర్తీ చేయాలని, ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఐటీడీఏ కార్యాలయంలో గ్రీవెన్స్ నిర్వహిస్తున్న అధికారులకు వినతిప్రతం అందజేశారు. జేఏసీ నాయకులు బి.ఉమామహేశ్వరరావు, రామ్మోహనరావు, రవి, పురుషోత్తం, పాల్, చిరంజీవులు, చంటిబాబు, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.