కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మొదటి కార్తీక సోమవారం ఆధ్యాత్మిక సందడితో కళకళలాడింది. ప్రత్తిపాడు మినర్వా కళాశాల సమీపంలో లక్షదీపాల మధ్య కోటి బిల్వార్చన పూజలు వైభవంగా జరిపారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాతోపాటు అనకాపల్లి, విశాఖ, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి భారీ ఎత్తున అయ్యప్ప భక్తులు తరలివచ్చారు. కేరళ సంప్రదాయ మంగళ వాయిద్యాల మధ్య పేడధూళి కార్యక్రమాన్ని కోలాహల ంగా జరిపారు. అయ్యప్ప కోటిబిల్వార్చన ప్రాంగణం వద్ద ఉదయం గణపతి పూజ, మండపారాధన, లక్ష్మీ గణపతి హోమాలు, చండీహోమం, పూర్ణాహుతి యాగాలు చేశారు. దంపాళిగురువర్యుల గురుపూజోత్సవం చేశారు. అష్టాదశ కలశాలతో మహిళా భక్తులు స్వామి ప్రదర్శన నిర్వహించారు.
సాయంత్రం పందల రాజవంశీకులు నారాయణవర్మ ప్రాంగణానికి చేరుకోగానే వేదపండితులు, అయ్యప్ప భక్తులు ఆయనకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. తొలుత ఆయన లక్ష దీపోత్సవానికి దీపాన్ని వెలిగించి ప్రారంభించగా అయ్యప్ప భక్తుల శరణుఘోషతో కోటి బిల్వార్చన పూజలకు శ్రీకారం చుట్టారు. శబరిమలకు చెందిన ఆలయ పూజారి మేల్ శాంతి సంప్రదాయ పద్ధతిలో లక్ష బిల్వార్చన పూజ చేశారు. పడిపూజా కార్యక్రమానికి ప్రాంగణమంతా అయ్యప్ప భక్తులతో నిండిపోయింది. లక్ష దీపోత్సవంలో ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా దీపాలను వెలిగించారు. కేరళలోని శబరిమల అయ్యప్ప సన్నిధానం మాదిరిగానే ఇక్కడ పూజలు చేశారు. అయ్యప్ప కోటి బిల్వార్చన కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.