ప్రభుత్వ పెద్దల అవినీతి, చేతకానితనాన్ని ప్రశ్నించకుండా, ప్రభుత్వ వ్యతిరేక వార్తలు రాకుండా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాను మేనేజ్ చేసిన చంద్రబాబు.. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలను కూడా అరెస్టులతో వేధించి భయభ్రాంతులకు గురి చేస్తే తమ ప్రభుత్వానికి తిరుగుండదని భావిస్తున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు వి.మనోహర్‌రెడ్డి, పార్టీ అధికార ప్రతినిధులు పుత్తా శివశంకర్‌రెడ్డి, కొమ్మూరి కనకారావు మాదిగ ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మనోహర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి, కనకారావు మీడియాతో మాట్లాడారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాపై ప్రభుత్వం కక్ష కట్టిందన్న వారు, రాష్ట్ర ప్రభుత్వం దారుణంగా నిరంకుశంగా వ్యవహరిస్తోందని, ప్రశ్నిస్తే అరెస్టులు చేసి కేసులు పెడుతోందని, పార్టీ సోషల్ మీడియాకు భయపడే ప్రభుత్వం ఈ పని చేస్తోందని వారు ఆక్షేపించారు. కృష్ణా జిల్లాలో ఒక్కరోజే 42 మందిపై కేసులు నమోదు చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టిన వారు, వరద సహాయ పనుల్లో చోటు చేసుకున్న అంతులేని అక్రమాలను ప్రశ్నించారని కేసుల నమోదు అత్యంత హేయమని అన్నారు.