డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ఏపీలో శాంతిభద్రతలపై చేసిన వ్యాఖ్యలపై వైసీపీ స్పందించింది. హోంమంత్రిగా తానుంటే పరిస్థితులు వేరేగా ఉంటాయంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి, వైసీపీ అధికార ప్రతినిధి రోజా స్పందించారు. కార్తీకమాసం తొలి సోమవారం సందర్భంగా శ్రీకాళహస్తీశ్వరస్వామిని రోజా దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన రోజు.. పవన్ కళ్యాణ్ ఈరోజు చేసిన వ్యాఖ్యలను తామెప్పటి నుంచో చెప్తూనే ఉన్నామన్నారు. మేము మొదటి నుంచి చెప్తున్నదే పవన్ కళ్యాణ్ ఇవాళ చెప్పారని అన్నారు. టీడీపీ కూటమి సర్కారు పాలనలో ఏపీలో శాంతిభద్రతలు క్షీణించాయని రోజా విమర్శించారు.
"టీడీపీ కూటమి సర్కారు పాలనలో ఏపీలో శాంతిభద్రతలు క్షీణించాయి. ప్రజలంతా అష్టకష్టాలు పడుతున్నారు. 120 రోజుల్లో వందకుపైగా హత్యలు, మానభంగాలు, దాడులు జరిగాయి. ఇవన్నీ చూస్తే మనమెక్కడున్నామనే భయం వేస్తోంది. ఇన్నిరోజులూ మేము చెప్తున్న మాటే పవన్ కళ్యాణ్ ఈ రోజు చెప్పారు. హోం మంత్రి విఫలమయ్యారని.. మహిళలపై దాడులను అరికట్టలేకున్నారని మేము చెప్తూనే ఉన్నాం. అదే మాటను పవన్ కళ్యాణ్ చెప్పారు. మేము చెబితే మాపై ఎగిరిన హోంమంత్రి వంగలపూడి అనిత ఇప్పుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు ఏం సమాధానం చెప్తారు? హోం మంత్రి విఫలమయ్యారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండా పోయింది."
" హోంమంత్రి ఫెయిలయ్యారని స్వయానా సహచర మంత్రే చెప్పారు. ఇప్పటికైనా వంగలపూడి అనిత తన మంత్రి పదవికి రాజీనామా చేయాలి. సీఎం చంద్రబాబు నాయుడు చేతిలో శాంతిభద్రతలు ఉన్నాయి. పోలీసులు, అధికారులు సరిగా పనిచేయకపోతే ఆ బాధ్యత ప్రభుత్వానిదే. సీఎం చంద్రబాబు కూడా రాజీనామా చేయాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేయాలి."
"కుంభకర్ణుడు ఆరునెలలకు ఓసారి నిద్రలేచినట్లుగా.. పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడూ విలేకర్ల సమావేశం పెట్టి వైసీపీ వాళ్లను తిట్టేసి వెళ్తారు. పిఠాపురంలోనూ అత్యాచారం జరిగింది. పవన్ కళ్యాణ్ కూడా విఫలమయ్యారు. చంద్రబాబు, పవన్, అనిత ముగ్గురూ విఫలమయ్యారు. ముగ్గురూ రాజీనామా చేయాలి. పోలీసులను తిట్టడం ఫ్యాషన్ అయ్యింది. జగన్ సర్కారులో సరిగా పనిచేసిన పోలీసులు.. ఇప్పుడెందుకు చేయడం లేదు?" అని మాజీ మంత్రి రోజా ప్రశ్నించారు.