ఉత్తర కొరియా మరో బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించిందని దక్షిణకొరియా సియోల్ మిలిటరీ తెలిపింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ వేళ క్షిపణి ప్రయోగం జరిగిందని పేర్కొంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని వెల్లడించింది. కాగా, ఇటీవలే ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని ఉత్తరకొరియా ప్రయోగించిన విషయం తెలిసిందే.ఉత్తర కొరియా మరో బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించింది. క్షిపణిని ఆ దేశ తూర్పు తీరం నుంచి దక్షిణ కొరియా తూర్పు సముద్రం వైపునకు ప్రయోగించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది’ అని సియోల్ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ వెల్లడించారు. అటు జపాన్ ప్రభుత్వం కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది.మరోవైపు, ఈ పరీక్షలపై ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్ స్పందించారు. తమ శత్రు దేశమైన దక్షిణ కొరియా దుందుడుకు స్వభావానికి ప్రతిస్పందనగా ఈ పరీక్ష నిర్వహించామని ఆమె పేర్కొన్నట్లు అక్కడి అధికారిక మీడియా కథనాలు తెలిపాయి. ‘‘అణు శక్తులను మరింత బలోపేతం చేసుకోవాల్సిన సమయం వచ్చింది. అందుకే కార్యాచరణ చేపట్టాం. కొరియా ద్వీపకల్పంలో మా ప్రత్యర్థుల ఆధిపత్యంలో సమతుల్యత ఉండాలి. లేదంటే ఈ ప్రాంతంలో యుద్ధం వచ్చినట్లే’’ అని ఆమె పేర్కొన్నట్లు ఆ కథనాలు వెల్లడించాయి.
ఇదిలా ఉండగా.. గత వారం ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించినట్లు స్వయంగా ఉత్తర కొరియా ప్రకటించింది. కిమ్ సమక్షంలో జరిగిన ఈ ప్రయోగం దేశ భద్రతకు ముప్పు కలిగించే శత్రువుల ఎత్తుగడలకు ప్రతిస్పందన చర్య అని ఆయన అభివర్ణించారు.