ఎన్నికల వ్యూహకర్త నుంచి రాజకీయ నేతగా మారారు ప్రశాంత్ కిషోర్. కీలక సమయాల్లో కీలక పార్టీల గెలుపు కోసం వ్యూహకర్తగా పనిచేసిన ఆయన.. తానే స్వయంగా పార్టీని స్థాపించారు.జన్ సురాజ్ పేరుతో పార్టీని ప్రకటించి బిహార్ ఎన్నికల బరిలో నిలిచారు. ఇప్పుడు ఆయనే ఇతర పార్టీలకు సవాల్ విసురుతున్నారు.ప్రశాంత్ కిషోర్ 2014లో సార్వత్రిక ఎన్నికలతో ఆయన పేరు వెలుగులోకి వచ్చింది. ఆ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంతో పీకే పేరుకు పబ్లిసిటీ వచ్చింది. ఆ పార్టీకి ఆ సమయంలో వ్యూహకర్తగా వ్యవహరించారు. మోడీ విజయంలో కీలక పాత్ర పోషించారు. అనంతరం 2015 బిహార్ ఎన్నికల్లో జేడీయూ-ఆర్జేడీల మహాఘాట్ బంధన్‌కు ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా పనిచేశారు. ఇక.. 2017లో పంజాబ్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఆయన వ్యూహాలతోనే అక్కడ కాంగ్రెస్ గెలుపొందింది. అలాగే.. 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో జగన్ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేశారు. వైఎస్సార్సీపీకి సలహాదారుగా వ్యవహరించారు. దాంతో ఆ ఎన్నికల్లో జగన్ పార్టీ ఘన విజయం సాధించింది. జగన్ ముఖ్యమంత్రి అయ్యారు.2020లో ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయానికీ పీకేనే కారణం అయ్యారు. ఇక 2021లో తమిళనాడులో డీఎంకే, పశ్చిమబెంగాల్‌లో టీఎంసీ కోసం పీకే కీలకంగా పనిచేశారు. అయితే.. 2023 నుంచి ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. తన ఐ-ప్యాక్ నుంచి తప్పుకున్నారు. ఎన్నికల వ్యూహకర్త బాధ్యతల నుంచి తప్పుకుని సొంతంగా పార్టీని స్థాపించారు. జన సూరజ్ పేరుతో పార్టీని పెట్టి బిహార్‌లో పాదయాత్ర సైతం చేపట్టారు. అయితే.. ఇటీవలే దానిని రాజకీయ పార్టీగానూ మార్చారు. కామన్ సివిల్ కోడ్ అంశంపైనా ఆయన స్పందించారు. ప్రజాభిప్రాయం లేకుండా ఏకాభిప్రాయంతో ముందుకు పోవడం సరికాదన్నారు.
అయితే.. ఇటీవల ప్రశాంత్ కిషోర్ మరికొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. పీకే ఎన్నికల స్ట్రాటజిస్ట్‌గా పనిచేస్తే ఆయన ఎంత చార్జ్ చేస్తారో ఇంతవరకూ ఎవరికీ తెలియదు. పనిచేయించుకున్న పార్టీకి, ఆయనకు తప్పితే బహిరంగంగా ఏనాడూ ఎక్కడా చెప్పలేదు. కానీ.. బిహార్‌లోని బెలాగంజ్ అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రచారంలో.. ఎన్నికల వ్యూహకర్తగా ఆయన వసూలు చేసే ఫీజుపై కీలక కామెంట్స్ చేశారు. రాజకీయ పార్టీలకు సలహాదారుగా పనిచేసి.. తాను అందించిన సేవలకు తీసుకునే ఫీజును చెప్పకనే చెప్పారు.
తాను ఏదైనా పార్టీకి వ్యహకర్తగా పనిచేస్తే అందుకు ఫీజు కింద రూ.100 కోట్లు తీసుకుంటానని పీకే చెప్పారు. కొన్ని కొన్ని సందర్భాల్లో అంతకుమించి కూడా తీసుకుంటానని అన్నారు. వివిధ రాష్ట్రాల్లోని పది ప్రభుత్వాలు తన వ్యూహాలతోనే నడుస్తున్నాయని చెప్పుకొచ్చారు. ఒక ఎన్నికల కోసం తాను వ్యూహకర్తగా పనిచేస్తే రెండేళ్ల పాటు తన పార్టీని నడుపుకోవచ్చన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.
అయితే.. ఎట్టకేలకు పీకే తన ఫీజుపై చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు మరో చర్చ రచ్చ జరుగుతోంది. ఒక్కో పార్టీకి సలహాదారుగా పనిచేస్తే రూ.100 కోట్లు తీసుకుంటానని చెప్పిన పీకే.. మరి అందులో నుంచి చెల్లించాల్సిన పన్ను చెల్లించారా అన్న చర్చ నడుస్తోంది. రూ.100 కోట్ల నుంచి సుమారుగా రూ.40 కోట్ల వరకు ఆయన టాక్స్ కట్టాల్సి ఉంటుంది. మరి.. ఇన్ని పార్టీలకు ఇన్ని వందల కోట్లు వసూలు చేసిన ఆయన కేంద్రానికి ఏ మేరకు పన్నులు చెల్లించారని పలు పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. వంద కోట్ల రూపాయలకు సంబంధించి ఆయన భారత ప్రభుత్వానికి లెక్కలు చెప్పారా..? అని నిలదీస్తున్నాయి. వసూలు చేసిన వంద కోట్ల నుంచి రూ.40 కోట్లు టాక్స్ పే చేశారా..? లేదా..? అని ప్రశ్నిస్తున్నాయి. ఇదే అంశాన్ని బిహార్‌లో ఇతర పార్టీలు అస్త్రంగా మలచుకోబోతున్నాయి.
అటు.. పీకే వ్యాఖ్యలతో పార్టీలు కూడా ఇరకాటంలో పడ్డాయి. ఒక్కో స్ట్రాటజీకి ఆయన రూ.100 కోట్లు తీసుకుంటా అని చెప్పారు. దాంతో ఇప్పటివరకు ఆయనతో పనిచేయించుకున్న పార్టీలు ఆ రూ.100 కోట్లను ఎన్నికల ఖర్చులో చూపాయా..? అసలు ఆ రూ.100 కోట్లను ఎలా సమకూర్చారు..? పార్టీలు ఎక్కడి తెచ్చి పీకేకు ఇచ్చాయి..? వీటి గురించి సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఇప్పుడు పార్టీలపై ఎంతైనా ఉంది. అటు పీకే కూడా టాక్స్ చెల్లింపుపైనా వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని నెట్టింట చర్చ నడుస్తోంది.