తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక. శ్రీవారి ఆలయంలో నవంబర్ 8వ తేదీన ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. నవంబరు 9న శ్రీవారి ఆలయంలో పుష్పయాగం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో నవంబరు 8 అంటే.. శుక్రవారం రాత్రి 8 నుంచి 9 గంటల వరకు పుష్పయాగానికి అంకురార్పణ చేయనున్నారు. ఈ క్రమంలోనే నవంబరు 8న సాయంత్రం సహస్రదీపాలంకార సేవను టీటీడీ రద్దు చేసింది. అలాగే నవంబరు 9న కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం ఆర్జితసేవలను రద్దుచేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఓ ప్రకటనలో తెలిపింది. తోమాల, అర్చన సేవలు ఏకాంతంగా నిర్వహించనున్నట్లు తెలిపింది.
ఇక పుష్పయాగంలో భాగంగా.. నవంబర్ 9న తిరుమల శ్రీవారి ఆలయంలో రెండవ అర్చన, రెండవ గంట, నైవేద్యం తర్వాత స్వామివారి ఉత్సవర్లను సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణ మండపానికి తీసుకువస్తారు. అక్కడ ఉత్సవ మూర్తులకు స్నపన తిరుమంజనం కార్యక్రమం నిర్వహిస్తారు. స్నపన తిరుమంజనంలో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు వంటి సుగంధద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం నిర్వహిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం ఐదు వరకు వివిధ రకాల పుష్పాలు, పత్రాలతో పుష్పయాగం శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. సాయంత్రం సహస్రదీపాలంకార సేవ తర్వాత మాడ వీధుల్లో స్వామివారు విహరిస్తారు.
హోంమంత్రిపై వ్యాఖ్యలు.. పవన్ కళ్యాణ్‌పై రోజా ఘాటు విమర్శలు
మరోవైపు కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఈ నెలలో మన గుడి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. నవంబరు 11 నుంచి 17వ తేదీ వరకూ తెలుగు రాష్ట్రాల్లోని ఎంపిక చేసిన శివాలయాల్లో మనగుడి కార్యక్రమం నిర్వహిస్తారు. జిల్లాకు ఒకటి చొప్పున శివాలయాలను ఎంపిక చేస్తారు. అనంతరం ఏడు రోజులపాటు కార్తీక మాస విశిష్టతను తెలియజేస్తారు. అలాగే ప్రతి జిల్లాలో రెండు ఆలయాల్లో నవంబరు 13న కైశిక ద్వాదశి పర్వదినం సందర్భంగా కార్యక్రమాలు నిర్వహిస్తారు. నవంబర్ 15న ప్రతి జిల్లాలోని ఓ శివాలయంలో దీపోత్సవం జరుపుతారు. ఈ విషయాన్ని టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది.